- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ కొత్త వ్యూహం.. వారిపైనే ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవర్గాలకు దగ్గర కావడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రులు, యువత, ఫస్ట్ టైమ్ ఓటర్లు, మహిళలు, ప్రైవేటు ఉద్యోగులు ఇలా వివిధ సెక్షన్ల ప్రజలను టార్గెట్ చేస్తోంది. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న వర్గాలన్నింటినీ తనవైపు తిప్పుకోవాలనుకుంటోంది. వారితోనే సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలకు ప్లాన్ చేయాలనుకుంటోంది. దీంతో ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా చేయాలన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోంది. స్వామిగౌడ్ లాంటి నేతలు పార్టీలో చేరినందున ఆయనకు సన్నిహితంగా ఉండే ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి అసంతృప్తిని నిరసన రూపంలోకి మార్చడానికి అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయనేదాని మీద బీజేపీ నేతలు లోతుగా విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున తెలంగాణలో ఆ విషయాన్ని కొంతకాలం పక్కన పెట్టాలని అనుకుంటున్నారు.
ఎమ్మెల్సీ గెలుపునకు..
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని పదిలపర్చుకుంటూనే మరోదాన్ని సైతం గెలుచుకోవాలనుకుంటోంది బీజేపీ. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మూడు జిల్లాల పరిధిలో ఉన్న ఆరు పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులపై ఉన్న అసంతృప్తి తీవ్రతను కూడా పరిశీలిస్తోంది. పట్టభద్రులే ఓటర్లుగా ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీరి ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు లాంటి వారందరినీ పార్టీవైపు తిప్పుకోవాలన్నది వ్యూహం. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రభావం చూపిన అంశమే ఎమ్మెల్సీ ఎన్నికలలో మరింత తీవ్రంగా కనిపిస్తుందని, టీఆర్ఎస్‌కు వ్యతిరేక తీర్పును ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నది బీజేపీ అభిప్రాయం. దీన్ని అసెంబ్లీ ఎన్నికల వరకూ తీసుకెళ్లి ఓటు బ్యాంకును పటిష్టంగా ఉంచుకోవాలని భావిస్తోంది. వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో వ్యతిరేకత ఉన్నా తెలంగాణలో ఆ మేరకు లేకపోవడం ఒకింత ఉపశమనమేనని అనుకుంటోంది. ఢిల్లీలో ఆందోళనలు సద్దుమణిగిన తర్వాత ఇక్కడి రైతులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చని భావిస్తోంది.
నిత్యం నిరసనలతో..
రైతాంగం మినహా అన్ని సెక్షన్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నందున ఆయా అంశాలను ఎప్పటికప్పుడు బయటకు తెస్తూ నిత్యం నిరసనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంపై దృష్టి పెట్టింది. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వడ్డీ లేని రుణాలు, ఆసరా పింఛన్లు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు ఇలా అన్ని అంశాలపైనా ప్రభుత్వానికి తలనొప్పి ఉండేలా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నడిపిస్తూ ఉండాలన్నది బీజేపీ భావన హైదరాబాద్ నగరంలో మాత్రమే కాక జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో సైతం అధికారులు, అధికార పార్టీ ప్రతినిధులపై వత్తిడి తెచ్చేలా కార్యాచరణ కోసం సమావేశాలను నిర్వహించాలనుకుంటోంది. ఎక్కడెక్కడ టీఆర్ఎస్‌కు బలం తక్కువగా ఉందో గుర్తించి అక్కడ బీజేపీని బలోపేతం చేసి అనుకూల పరిస్థితులను సృష్టించుకోవాలనేది ఆ పార్టీ దీర్ఘకాలిక లక్ష్యం. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సైతం ఇలాంటి అంశాలపైనే ఫోకస్ పెట్టాలనుకుంటోంది.