అలక వీడిన రాజాసింగ్

by Anukaran |   ( Updated:2020-11-26 23:57:38.0  )
అలక వీడిన రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు గ్రేటర్ ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. వారం రోజుల అలక వీడారు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో కాకుండా కూకట్‌పల్లిలో ప్రచారానికి దిగుతున్నారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఆయన గెలుపుకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఇద్దరికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గన్‌ఫౌండ్రీ, బేగం బజార్ డివిజన్ల నుంచి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టింది. ఆ మనస్తాపంతో గత వారం రోజులుగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితం అయ్యారు. కానీ ఆయన సమీప బంధువు చనిపోవడంతో మూడు రోజుల పాటు ఆ బాధలోనే ఉండిపోయారు.

తెలంగాణ బీజేపీలో దూకుడుగా వ్యవహరించే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో.. పార్టీలో నాయకత్వానికి ఆయనకు మధ్య అగాధం పెరిగిందని, గ్రూపులు ఏర్పడ్డాయన్న వార్తలు గుప్పుమన్నాయి. మేయర్ సీటును కొట్టేద్దామనుకుంటున్న పార్టీకి రాజాసింగ్ వ్యవహారం కొంత తలనొప్పిగానే మారింది. చివరకు పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆయనను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రంగంలోకి దించాలని రాష్ట్ర నాయకత్వం భావించక తప్పలేదు. ఆ ప్రకారం చివరి మూడు రోజులు ఆయన్ను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకోవాలనే నిర్ణయం తీసుకుంది.

రాజాసింగ్ ను బుజ్జగించి ప్రచారంలో పాల్గొనేందుకు ఒప్పించారు తెలంగాణ బీజేపీ పెద్దలు. ఆయన అలక వీడడంతో శుక్రవారం కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రోడ్‌షో షెడ్యూలు ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఉదయం 9.00 గంటలకు కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి బాలాజీనగర్ మీదుగా కూకట్‌పల్లి వరకు జరిగే రోడ్‌షోలో రాజాసింగ్ పాల్గొంటున్నారు. ఆ తర్వాతి రెండు రోజుల షెడ్యూలు కూడా ఈ రోజే ఖరారవుతుంది.

Advertisement

Next Story

Most Viewed