వ్యూహాలను అనుసరిస్తాం : బెర్గర్ పెయింట్స్

by Harish |
వ్యూహాలను అనుసరిస్తాం : బెర్గర్ పెయింట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే రెండో అతిపెద్ద పెయింట్ తయారీదారుగా ఉన్న బెర్గర్ పెయింట్స్.. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మూలధన వ్యయం ప్రభావితం కాలేదని, గతేడాది మాదిరిగానే ఉండనుందని వెల్లడించింది. లక్నో సమీపంలో కొత్త ప్లాంట్ కోసం సుమారు రూ. 260 కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్టు, 2022 నుంచి ఆ ప్లాంట్ పనిచేయనున్నట్టు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. పెయింట్స్ పరిశ్రమలో 50 శాతం వాటాను కలిగి ఉన్న మార్కెట్ లీడర్ ఏషియన్ పెయింట్స్‌తో పోటీలో కొనసాగించేందుకు కొన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

‘రానున్న రోజుల్లో మరింత మార్కెట్ వాటాను మెరుగుపరుచుకునేందుకు, ఏషియన్ పెయింట్స్‌తో ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసం పలు చర్యలు తీసుకోనున్నట్టు’ బెర్గర్ పెయింట్స్ ఎండీ, సీఈవో అభిజిత్ రాయ్ వాటాదారులనుద్దేశించి చెప్పారు. ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ తమ సంస్థ పరిమాణానికి మూడు రెట్లు ఉంది. తాము 18-20 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాం. ఇటీవలి పరిణామాల్లో అనుసరించిన వ్యూహాలు ఫలించిన నేపథ్యంలో మరింత వృద్ధిని సాధించగలమనే ఆశాభావాన్ని కలిగి ఉన్నట్టు అభిజిత్ పేర్కొన్నారు.

మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకునేందుకు పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత పెంచే వ్యూహాలను అనుసరించనున్నట్టు ఆయన వెల్లడించారు. కొవిడ్-19 కాలంలో వ్యాపార పనితీరుపై స్పందించిన ఆయన.. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గా ఉందని చెప్పారు. టైర్ 2,3,4 పట్టణాల్లో సానుకూలంగా ఉంది. నగరాలు కరోనా వ్యాప్తి కారణంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. జూన్ తర్వాత పరిస్థితులు మెరుగవడంతో దాదాపు రెండంకెల వృద్ధిని సాధించినట్టు అభిజిత్ తెలిపారు.

Advertisement

Next Story