షమీపై ట్రోలింగ్ పట్టించుకోవద్దు.. బీసీసీఐ కీలక సూచన

by Shyam |
షమీపై ట్రోలింగ్ పట్టించుకోవద్దు.. బీసీసీఐ కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ 3.5 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చాడు. షమీ వేసిన 18వ ఓవర్‌లోనే పాక్ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో మ్యాచ్ అనంతరం పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షమీపై విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన పదజాలం ఉపయోగించి షమీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

కాగా షమీపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడిని సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ గాంధీ సహా.. పాక్ బ్యాటర్ రిజ్వాన్ కూడా ఖండించాడు. అయితే భారత జట్టు కెప్టెన్ కోహ్లీ కానీ, సహచర క్రికెటర్లు కానీ, షమీకి మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు. తోటి క్రికెటర్‌పై విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. ‘ఇలాంటి ట్రోలింగ్స్‌ను పట్టించుకోవద్దు.. అనవసర వివాదాల్లోకి దూరి విషయాన్ని మరింత క్లిష్టంగా మార్చొద్దు’ అని టీమ్ ఇండియాకు చెప్పినట్లు సమాచారం. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి ఆన్‌లైన్ దూషణలపై స్పందించవద్దనే నియమం ఉన్నది. అందుకే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed