- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt.: పక్కగా ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్..! అధ్యయనం తర్వాతే అమలుకు ప్లాన్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మెరుగైన భూ పరిపాలన అందించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ముందుగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే చట్టం ప్రకారమే అన్ని పనులు చేస్తామని చెప్పిన తర్వాత ‘పైలెట్ ప్రాజెక్టు’ ఎందుకు అన్న చర్చ నడుస్తున్నది. ఈ అనుమానాలను అధికారులు నివృత్తి చేయకపోవడంతో గందరగోళం నెలకొన్నది. ఈనేపథ్యంలో ప్రాజెక్టు ఉద్దేశ్యం, లక్ష్యం సరైనదేనని, దీని వెనుక అసలు విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరమున్నదని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, భూ భారతి చట్ట రూపకర్త ఎం.సునీల్ కుమార్ ‘దిశ’కు తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ ప్రాజెక్టుగా చేపట్టినట్లు వివరించారు.
భూభారతి పైలెట్ కింద ఎంపికైన మండలాలు
* నారాయణపేట జిల్లా మద్దూరు
*ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
*ములుగు జిల్లా వెంకటాపూర్
*కామారెడ్డి జిల్లా లింగంపేట
మాన్యువల్‌గా అప్లికేషన్ల స్వీకరణ.. స్టడీ
ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామాల్లో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి రైతు నుంచి మాన్యువల్ గా అప్లికేషన్లను స్వీకరిస్తారు. వాటిని స్టడీ చేస్తారు. మే ఒకటో తేదీ నుంచి జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత జూన్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. అన్ని గ్రామాల్లోనూ సదస్సులు చేపట్టి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. కాగా, భూ భారతి విషయంలో సీరియస్ గా తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. అవగాహనా సదస్సులకు తప్పనిసరిగా వెళ్లాలని ఆదేశించారు. ఆఫీసులో కూర్చొని కార్యకలాపాలు చేపడుతామంటే సహించేది లేదని హెచ్చరించారు. భూ భారతి చట్టంపై ప్రతి అధికారి, రెవెన్యూ ఉద్యోగి అవగాహన పెంపొందించుకోవాలని, ఆ తర్వాత సదస్సుల్లో రైతులకు వివరించాలన్నారు. ఈ క్రమంలోనే భూ భారతి విధి విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.
లీఫ్ట్ స్టడీయే సర్కారుకు స్ఫూర్తి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో పది గ్రామాల్లో భూ సమస్యలపై అధ్యయనం చేశారు. సమస్యల గుర్తింపు, పరిష్కారానికి ఆరు నెలల పాటు శ్రమించారు. పది మంది న్యాయవాదులు, పారా లీగల్ వర్కర్క్స్ గ్రామాల్లోనే బస చేసి రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించారు. మొదటి దశలో ప్రతి గ్రామంలో భూ న్యాయ శిబిరం నిర్వహించి సమస్యలను గుర్తించారు. రెండో దశలో సమస్యలు ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న పత్రాలు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి నివేదిక రూపొందించారు. పది గ్రామాల్లోనే 2,114 మంది భూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ సమస్యలు సైతం ఉన్నాయి. అలా వారిలో 4,465 సర్వే సబ్ డివిజన్లకు సంబంధించి భూమి సమస్యలను గుర్తించారు. వాటి ఆధారంగానే ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. మళ్లీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనూ పైలెట్ ప్రాజెక్టు చేపట్టి భూ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. రానున్న రోజుల్లో మూడో దశలో సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖకు ఆ అప్లికేషన్లను సమర్పించనున్నారు.
స్టడీలో గుర్తించిన సమస్యలు
* అసైన్డ్ పట్టాలు ఉన్నా కొత్త పాసు పుస్తకాలు జారీ చేయలేదు.
* భూదాన్, వక్ఫ్, సీలింగ్, దేవాదాయ భూములంటూ పట్టా ల్యాండ్స్ ను పీవోబీలో నమోదు చేశారు.
* ధరణి పోర్టల్ లో రైతుల పేరిట ఉండాల్సిన భూమి కంటే తక్కువ విస్తీర్ణం నమోదైన కేసులు అధికం. కొన్ని సర్వే నంబర్లు కూడా మిస్ అయ్యాయి.
* సాదాబైనామా కింద కొనుగోలు చేసిన రైతులు ఉన్నారు.
* ఇలా 15 రకాల సమస్యలను గుర్తించారు.
పైలెట్ ప్రాజెక్టు సిఫారసులు
* రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేరు. మాన్యువల్ గా ఇచ్చినా స్వీకరించాలి.
* ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కనీసం నలుగురితో కూడిన సపోర్టింగ్ టీమ్ ఏర్పాటు చేయాలి.
* ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు స్వీకరించాలి. సింపుల్ ఫార్మాట్ ద్వారా రైతు సమస్యను అడగాలి.
* దరఖాస్తులకు అవసరమైన డాక్యుమెంట్లు అడిగి తీసుకోవాలి.
* వాటన్నింటిపైనా స్పీకింగ్ ఆర్డర్ రాయాలి. సమస్యలను పరిష్కరించాలి.
* తిరస్కరించే వాటికి కారణాలు చెప్పాలి.
గ్రామాల్లోనే అప్లికేషన్లు స్వీకరిస్తే..
యాచారం ప్రాజెక్టులో అనేకాంశాలను అధ్యయనం చేశారు. ప్రతి రైతు తనకు సమస్య ఉందన్న విషయాన్ని గుర్తించలేదు. కనీసం కంప్యూటర్ లో చెక్ చేసుకోలేదు. ఎవరైతే క్రయ విక్రయాలకు వెళ్దామనుకున్నారో, వారు మాత్రమే సమస్య పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయం చేసుకుంటూ తన భూమి తన దగ్గరే ఉందన్న ధీమాతో ఉన్న వారెవరూ అప్లయ్ చేసుకోలేదు. ప్రతి గ్రామంలోనే భూ శిబిరం ద్వారా అప్లికేషన్లు స్వీకరించి, రిపోర్టులు రూపొందించొచ్చు. వందకు వంద శాతం సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే ఇంటింటికీ వెళ్లి వారి భూ రికార్డులను పరిశీలించాలి. వారి దగ్గరున్న డాక్యుమెంట్లకు, రెవెన్యూ రికార్డులకు మధ్య ఎంత తేడా ఉన్నదో చూడాలి. ఆ సమస్యలకు ఆ వెంటనే పరిష్కార మార్గాలను చూపాలి.
ప్రతి ఇంటికీ వైద్య పరీక్షల మాదిరిగా రెవెన్యూ రికార్డుల పరీక్షలు చేపట్టడం ద్వారా సమస్యల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని భూమి సునీల్ ప్రభుత్వానికి వివరించారు. ఇప్పుడూ యాచారం స్ఫూర్తితోనే అదే ఫార్మాట్ లో గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలను గుర్తించనున్నారు. ఆ అధ్యయనం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందో తెలుసుకోవడానికే నాలుగు మండలాల్లో భూభారతి పైలెట్ ప్రాజెక్టు చేపడుతున్నారు.