IPL 2021-Phase 2.. సెప్టెంబర్ 18 ప్రారంభం

by Shyam |   ( Updated:2021-05-31 10:39:16.0  )
IPL 2021-Phase 2.. సెప్టెంబర్ 18 ప్రారంభం
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ తమ పంతం నెగ్గించుకోవడానికి ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నది. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు (IPL-2021) దూరమైనా తాను అనుకున్న షెడ్యూల్‌లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను పూర్తి చేయాలని బోర్డు పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే వేదికను ఖరారు చేసిన బీసీసీఐ.. పూర్తి షెడ్యూల్ ప్రకటించే ముందు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో చర్చలు జరపాలని భావిస్తున్నది. మంగళవారం దుబాయ్‌లో జరుగనున్న ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్‌కు హాజరవడానికి వచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల ఐపీఎల్ గురించి యూఏఈ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 18 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని.. అయితే లీగ్ గురించి ఈ వారాంతరం లోపు పూర్తి క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. ఈసీబీ, బీసీసీఐ అధికారులు ఈ వారంలో చర్చలు జరుపనున్నట్లు ఆయన తెలిపారు. హోటల్స్, వేదికలు, లాజిస్టిక్స్ సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈసీబీతో కీలక చర్చలు..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌తో పాటు మరి కొందరు బీసీసీఐ అధికారులు బుధవారం యూఏఈ వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే వాళ్లు దుబాయ్ బయలుదేరి వెళ్లాలి. కానీ ఐసీసీ సమావేశానికి రాజీవ్ శుక్లా మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొంటారు. గంగూలీ, జైషా వర్చువల్ పద్దతిలో జాయిన్ కానున్నట్లు తెలుస్తున్నది. బుధవారం బీసీసీఐ అధికారులు యూఏఈ చేరుకొని ఈసీబీ అధికారులతో చర్చలు జరపనున్నారు. బీసీసీఐ ప్రతిపాదించిన సెప్టెంబర్ 18నే లీగ్ ప్రారంభం అవుతుందా లేదా అనేది ఈ చర్చల్లో తేలనుంది. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 14న ముగియనుండటంతో భారత క్రికెట్ జట్టు సభ్యులు యూఏఈ చేరుకొని మూడు రోజుల క్వారంటైన్ ఉండటానికి సెప్టెంబర్ 18ని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అయితే యూఏఈలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు చెందిన ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆతిథ్యం ఇస్తున్నందున ఏయే స్టేడియంలు ఖాళీగా ఉంటాయో చర్చల్లో తేలుతుంది. అవసరం అయితే ఐసీసీకి చెందిన స్టేడియంలను కూడా ఉపయోగించుకునేలా వారితో కూడా చర్చలు జరుపుతారని తెలుస్తున్నది. ఈ పర్యటనలో ఈసీబీ, ఐసీసీ అధికారులతో పూర్తి చర్చల అనంతరం స్టేడియంలు, తేదీలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. గతంలో ఐపీఎల్ నిర్వహించిన అనుభవం ఉంది కాబట్టి ఈసీబీ కూడా తేదీలు, స్టేడియంలపై సానుకూలంగా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారులు అంటున్నారు.

ప్రేక్షకులకు ఎంట్రీ..?

ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించడానికి ఈసీబీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది. యూఏఈలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నదని.. అదే సమయంలో 70 శాతం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. దీంతో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించడం వల్ల ప్రభుత్వానికి కూడా అభ్యంతరం ఉండదని ఈసీబీ చెబుతున్నది. అయితే కేవలం రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారినే స్టేడియంలోకి అనుమతించే అవకాశం ఉన్నది. ప్రేక్షకులను అనుమతించడం వల్ల బీసీసీఐకి మాత్రమే కాకుండా ఫ్రాంచైజీలకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కరోనా వచ్చిన దగ్గర నుంచి గేట్ ఆదాయం లేక పలు క్రికెట్ బోర్డులు తీవ్రంగా ఆర్థిక కష్టాలు పడుతున్నాయి. యూఏఈలో కనుక కనీసం 50 శాతం ప్రేక్షకులను అనుమతించినా.. ఇండియాలో కంటే భారీగానే ఆదాయాన్ని అర్జించే అవకాశం ఉంటుంది. ఇది బీసీసీఐకి కలసి వచ్చే అంశం. కాగా, బుధవారం జరిగే సమావేశంలో టికెట్లు ధరలపై ఎవరు నిర్ణయం తీసుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది. గత ఏడాది స్టేడియం అద్దెలతో పాటు ఆతిథ్యం ఇచ్చినందుకు ఈసీబీకి బీసీసీఐ దాదాపు రూ. 100 కోట్లు చెల్లించింది. ఇప్పుడు అద్దెల బదులు గేట్ ఆదాయాన్ని ఈసీబీ అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story