ఫ్రెంచ్ ఓపెన్ నయా ఛాంపియన్.. కప్పును ముద్దాడిన క్రెజికోవా

by Shiva |   ( Updated:2021-06-12 11:07:44.0  )
barbara-crazykova french open winner
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్‌కి చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి బార్బారా క్రెజికోవా కైవసం చేసుకున్నది. శనివారం సాయంత్రం రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫైనల్‌లో రష్యాకు చెందిన 31వ సీడ్ అనస్తాషియా పవ్లీచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. 25 ఏళ్ల క్రెజికోవా కెరీర్‌లో ఇది 5వ మేజర్ టైటిల్ మాత్రమే. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా ఆరో సారి కొత్త ప్లేయర్ గెలవడం విశేషం కాగా.. ఇందులో క్రెజికోవా మూడో అన్‌సీడెడ్ ప్లేయర్. 31వ సీడ్ పవ్లీచెంకోవాకు కూడా ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. అయితే తొలి సెట్ కోల్పోయిన తర్వాత రెండో సెట్ గెలిచి ఆటలో పుంజుకున్నది. అయితే ఎడమ కాలి గాయం కారణంగా మూడో సెట్‌లో అసౌకర్యంగా కనిపించింది.

క్రెజికోవా పలు అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్, డబుల్ ఫాల్ట్స్ చేసినా.. తన పవర్ గేమ్‌తో మూడో సెట్ గెలిచి సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. చెక్ రిపబ్లిక్‌కి చెందిన హన మండ్లికోవా తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. ఫ్రెంచ్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరుసగా కొత్త ఛాంపియన్లు అవతరిస్తున్నారు. గార్బిన్ ముగురూజా, జెలేనా ఆస్తపెంకో, సిమోనా హెలెప్, ఆష్లీ బార్టీ, ఇగ ష్వామ్‌టెక్ తర్వాత బార్బారా క్రెజికోవా టైటిల్ నెగ్గింది. ఇక క్రెజికోవా రోలాండ్ గారోస్‌లో 2013 గర్ల్స్ డబుల్స్, 2018లో ఉమెన్స్ డబుల్స్, 2021లో ఉమెన్స్ సింగిల్స్ గెలిచింది. ఆదివారం తన పార్ట్‌నర్ కేథరియా సినియాకోవా కలసి డబుల్స్ ఫైనల్స్ ఆడనున్నారు. ఈ టైటిల్ గెలిస్తే ఒకే ఏడాది సింగిల్స్, డబుల్స్ గెలిచిన మేరీ పియర్స్ (2000లో) రికార్డును సమం చేసే అవకాశం ఉన్నది.

నాకు చాలా ఆనందంగా ఉన్నది : క్రెజికోవా

ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం చాలా ఆనందంగా ఉన్నది. నా చిన్నతనంలోకోచింగ్ ఇచ్చిన జానా నొవాత్నా, గతంలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన హన మండ్లికోవాకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. నా కోసం కష్టపడిన కోచ్, నా టీమ్, తల్లిదండ్రులు, సోదరులు అందరికీ నా ధన్యవాదాలు.

Advertisement

Next Story

Most Viewed