యాప్‌లతో బంజారా పాట డిజిటల్ ప్రయాణం..

by Shyam |
యాప్‌లతో బంజారా పాట డిజిటల్ ప్రయాణం..
X

దిశ, వెబ్ డెస్క్: ‘తిరుపతి తు గోతో గానా, కనా అచ్చి కనా ఫోన్ కిది’, ‘ఏ రాణీ తమేనీ ఏ రోవనీ తు మారా లారా అనీ’, ‘వాజేలగా గుజరారీజోడీ’.. చూడ్డానికి తెలుగులాగే అనిపిస్తుంది కానీ తెలుగు కాదు అనుకుంటున్నారా? ఇది ఏ భాష, దీని అర్థం ఏంటనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇవన్నీ పాటలు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం, వంతడపల గ్రామంలోని తండాకు చెందిన బానోతు సురేశ్ ఇలాంటి పాటలను రోజు పొద్దున ఐదు గంటలకే తన వాట్సాప్ స్టేటస్‌లో పెడతాడు. ఒక్క సురేశ్ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బంజారా తండాలకు చెందిన చదువుకున్న యువత ఇప్పుడు ఇలాంటి పాటలనే తమ వాట్సాప్ స్టేటస్‌లలో పెడుతున్నారు. వాటి అర్థం సంగతేమో గానీ ఇలా స్టేటస్‌లు పెట్టడం వల్ల వారి భాషకు పునరుజ్జీవం పోస్తున్నారు. అవును.. బంజారా భాషకు లిపి లేదు, అలాగని వాళ్లు రాయడం మానలేదు. వారి భాషకు అధికారిక గుర్తింపు లేదు, అలాగని వాళ్లు వాడటం మానలేదు.

మొన్నటివరకు మాటలకు, డైలాగులకు మాత్రమే పరిమితమైన వారి భాష.. ఇప్పుడు షేర్‌చాట్, వాట్సాప్‌ లాంటి యాప్‌ల వల్ల డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇక యూట్యూబ్‌లో అయితే బంజారా పాటలు కోకొల్లలు. అయితే వీటి గురించి మీడియా బయటపెట్టకపోవడం వల్ల పాపులర్ అవడం లేదు కానీ, పెద్ద సినిమాల ట్రైలర్‌ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన బంజారా పాటలు బోలెడు ఉన్నాయి. ఆ భాష రానివారికి కూడా ఫీల్ అందించేంత చక్కగా ఈ పాటలు ఉంటాయి. క్రియేటివిటీ చూపించాలంటే భాషతో సంబంధం లేదు, మా సృజనాత్మకతను మా భాష అభివృద్ధికే ఉపయోగించుకుంటామనే ఉద్దేశంతో ఎందరో బంజారా యువకళాకారులు ఇలా పాటలు రాసి, పాడి, వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. అవే పాటల్లోని బాగా ఫీల్ ఉన్న రెండు మూడు వాక్యాలను షేర్‌చాట్, మోజ్ యాప్‌లలో 30 సెకన్ల వీడియోలుగా మారుస్తున్నారు. అవే వీడియోలను సందర్భోచితంగా వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టుకుంటున్నారు.

ట్యూన్ క్యాచీగా ఉండటం, పాడే విధానంలో ఫీల్ ఉండటంతో ఆ భాష రాని వారు కూడా ఆ పాటల అర్థాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అర్థం తెలుసుకున్న తర్వాత ఇందులో ఇంత మీనింగ్ ఉందా? అని నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే.. పెద్ద పెద్ద లిరిక్ రైటర్స్ కూడా ఇలా పల్లెపదాలను, జానపదాలను కలగలిపి రాయలేనంత అర్థాలు వారి పాటల్లో కనిపిస్తున్నాయి. బంజారా పాటల్లో ముఖ్యంగా ప్రేమ గీతాలు, విరహ గీతాలు, బ్రేకప్ సాంగ్స్ పాపులర్. నీకోసం అది చేస్తా, ఇది చేస్తా అని తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లు పాడుకున్నట్లుగా వీరి పాటలు అస్సలు ఉండవు. నువ్వు లేకపోతే నేను ఇలా అవుతా, నువ్వుంటే నేను ఇలా ఉంటా.. అనే అర్థం వచ్చేలా పాజిటివ్ సెన్స్‌లో ఈ పాటలు ఉంటాయి. రియాలిటీకి దగ్గరగా ఉండటం కూడా వీరి పాటలు ఫేమస్ అవ్వడానికి ఒక కారణం.

ఈ ప్రేమ గీతాలు కాకుండా వీరి డీజే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్లు ఏం పాడతారో అర్థం కాదు కానీ విన్నవారు మాత్రం కాళ్లతో చిందులేయకుండా ఉండలేరు. సంప్రదాయ డీజే పాటల మాదిరిగా కృత్రిమంగా జొప్పించిన అరుపులు, పెడబొబ్బలు ఉండకపోయినా బంజారా డీజే పాటలు తండాల్లో చాలా పాపులర్. వారి పెళ్లిళ్లలో, సంప్రదాయ పండుగల్లో ఈ పాటలే అసలైన హడావుడి. చుట్టాలు, బంధువులు అందరూ ఒక్క దగ్గర కలిసినప్పుడు కూడా ఈ డీజే పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడాలేకుండా డీజే డ్యాన్స్‌లతో సంబరాలు చేసుకునే విధంగా వీరి పాటలు ఉంటాయి.

మా భాష నశించిపోతోంది, అంతరించిపోతోంది, ప్రభుత్వం గుర్తించాలంటూ ధర్నాలు, నిరసనలు చేయకుండా.. ఇలా తమ భాష అభివృద్ధికి, ప్రచారానికి తమ క్రియేటివిటీని జోడించి, డిజిటల్ మీడియా, యాప్‌ల సాయంతో తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్న ఎంతో మంది బంజారా యువతీయువకులకు ‘దిశ’ హ్యాట్సాఫ్ చెబుతోంది. తెలుగు భాష అంతరించిపోతోందనే అంశం గురించి సభలు నిర్వహించి, ఆ సభల్లో అతిథులకు ఇంగ్లిష్‌లో వెల్‌కమ్ చెప్పే భాషావాదులు, ఈ బంజారా యువతను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకే ఇంటర్నెట్ అనేది ఉపయోగించుకున్నవాడికి ఉపయోగించుకున్నంత అని ఊరికే అనలేదు!

– ప్రగత్ దోమల

Advertisement

Next Story

Most Viewed