- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగళూరు జనాభా 1.2 కోట్లు, కొవిడ్ కేసులు 385.. ఎలా?
దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొవిడ్ 19 ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. హైద్రాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీలలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ బెంగళూరు గణాంకాలు మాత్రం అందుకు విభిన్నంగా ఉంటున్నాయి. ఆ నగర జనాభా 1.2 కోట్లు, కానీ ఇప్పటివరకు నమోదైన కొవిడ్ 19 కేసులు 385 మాత్రమే. ముంబై, చెన్నైలలో ఇన్ని కేసులు ఒక్కరోజులోనే నమోదైన రోజులున్నాయి. మిగతా నగరాల మాదిరిగానే బెంగళూరులో కూడా ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ తక్కువ కేసులు రావడానికి కారణం ఒక్కటే.. ఈ విధానాలను వారు అమలు చేస్తున్న విధానం.
నిపుణులను నమ్మే ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఏంటంటే.. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిపుణులు చెప్తున్న సలహాలను యథాతథంగా అమలు చేయడం. వైద్యనిపుణులు చెప్పిన ప్రతి చిన్న సలహాను వదిలేయకుండా అధికారులు నూటికి నూరుపాళ్లు అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఐసీఎంఆర్ రీసెర్చ్ టాస్క్ ఫోర్సులో పనిచేస్తోన్న కర్ణాటక రాష్ట్ర టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ గిరిధర్ బాబు చెప్పినదాని ప్రకారం.. కర్ణాటక ప్రభుత్వం వైద్య నిపుణులకు స్వేచ్ఛనివ్వడమే కొవిడ్ 19 నియంత్రణలో ప్రధాన భూమిక పోషించింది. ఆరోగ్యశాఖ ముందుండి నడిపించడం, సలహాలు కష్టతరమైనప్పటికీ వాటి గురించి చర్చించి నిపుణులను నమ్మడం వల్లనే ఇది సాధ్యమైందని గిరిధర్ బాబు అన్నారు.
ప్రభావవంతమైన కాంటాక్టు ట్రేసింగ్
మార్చి 8న అమెరికా నుంచి వచ్చిన ఓ నలభై ఏళ్ల టెకీకి కరోనా పాజిటివ్ రావడం బెంగళూరులో మొదటికేసు. అప్పుడే అప్రమత్తమైన బెంగళూరు మహానగర పాలికే అతన్ని కలిసిన 2666 మంది జాబితాను తయారు చేసి అందరికీ టెస్టులు నిర్వహించింది. నెల రోజుల పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను హోం క్వారంటైన్‌కు పంపినపుడే బెంగళూరు సగం విజయం సాధించినట్లయింది. తర్వాత ప్రతి కేసు గురించి బెంగళూరు ఆరోగ్య శాఖ వివరాలు సేకరించింది. అంతేకాకుండా జలుబు, దగ్గు లక్షణాలకు మందులు కొంటున్నవారి వివరాలను మెడికల్ షాపుల నుంచి తెప్పించుకుంది. వారిలో అనుమానం ఉన్న ప్రతిఒక్కరికి పరీక్షలు నిర్వహించింది.
కచ్చితమైన కంటైన్‌మెంట్ జోన్లు
ముంబైలోని ధారావి, చెన్నైలోని కోయంబీడు, ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ప్రాంతాలను సరిగా కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించని కారణంగానే ఆయా నగరాల్లో కొవిడ్ 19 విస్తృతంగా ప్రబలింది. కానీ బెంగళూరు విషయంలో అలా కాదు.. పశ్చిమ బెంగళూరులోని పాదరాయణపురను ఏప్రిల్ 10న హైరిస్క్ ప్రాంతంగా గుర్తించి వెంటనే దాన్ని సీల్ చేశారు. కేవలం ఆరోగ్య సిబ్బందిని మాత్రమే ఆ జోన్‌లోకి అనుమతించారు. నెలరోజుల పాటు ప్రతి ఇంటికి నిత్యావసరాలను అందించారు. మొత్తం బెంగళూరు కేసుల్లో 23.6 శాతం పాదరాయణపురలోనే నమోదయ్యాయి. వీరు గనక ముందే కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించి కఠినంగా వ్యవహరించకపోయి ఉంటే చాలా అనర్థం జరిగిపోయేది. అంతేకాకుండా లాక్‌డౌన్ విషయంలోనూ బెంగళూరు ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించడం ప్లస్సయ్యింది. ఏదేమైనా నిపుణుల సలహాలు పాటిస్తూ, రాజకీయాలకు పోకుండా, నిబంధనలు కచ్చితంగా అమలుచేసి కరోనా మహమ్మారిని కట్టడి చేయొచ్చని బెంగళూరు నిరూపించింది. ఇప్పటికైనా ఇతర నగరాలు తేరుకుని అన్‌లాక్ 1.0లోనైనా నిబంధనలు సరిగ్గా పాటిస్తే మంచిది.