CM స్థానం వద్దు.. సీఎంను తయారుచేస్తా.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

by Anukaran |   ( Updated:2021-10-04 00:24:49.0  )
CM స్థానం వద్దు.. సీఎంను తయారుచేస్తా.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయినట్లు భావిస్తున్న పార్టీ శ్రేణులు ఇప్పుడు హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టాయి. కేంద్ర నాయకత్వం ఆశీస్సులు, అండదండలు పుష్కలంగా ఉండటంతో రాష్ట్ర నాయకుల నుంచి సహకారం ఉన్నా లేకున్నా ఈటల గెలుపుపైనే బండి సంజయ్ ఇక దృష్టి సారించనున్నారు. కేంద్ర నాయకుల ఆదేశాల మేరకు ‘సీఎంను కాను.. సీఎంను తయారుచేసే వ్యక్తిని’ అంటూ సంకేతాలు ఇవ్వడంతో ఈటలతో గ్యాప్ లేదనే క్లారిటీ ఇచ్చినట్లయింది. పాదయాత్రతో వ్యక్తిగా సరికొత్త ఇమేజ్‌ సమకూరింది. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి సైతం సరికొత్త జోష్ తీసుకొచ్చారనే భావన శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.

రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 35 రోజుల పాటు జరిగిన పాదయాత్రకు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి పెద్దగా ప్రోత్సాహం లేదు. కేంద్ర స్థాయి నాయకులు మాత్రం అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, రమణ్‌సింగ్ ఈ పాదయాత్రకు హాజరయ్యారు. ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ సహా మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. పార్టీ జాతీయ స్థాయి నాయకులు 24 మంది హాజరయ్యారు. కానీ రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఉన్నా వారెవ్వరూ హాజరుకాలేదు.

రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తొలి రోజుల్లో రాష్ట్ర నాయకత్వం నుంచి సహకారం, ప్రోత్సాహం కనిపించినా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నాయకుల సహకారం, పార్టిసిపేషన్ అంతంతమాత్రంగానే ఉన్నది. పార్టీలో రాష్ట్ర స్థాయిలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నదంటూ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను బలపరిచే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

ఇకపైన బండి సంజయ్ హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికమీదనే పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారు. పాదయాత్ర, ముగింపు సభ స్పందనను చూసిన పార్టీ శ్రేణులు బండి సంజయ్ ప్రచారంతో హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమనే భావనతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హుజూరాబాద్‌లో గెలుపు ఖాయం అంటూ అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలు పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. వ్యక్తిగా ఈటల రాజేందర్ సైతం అంతే ధీమాతో ఉన్నారు. ఇప్పటివరకూ పార్టీ తరఫున ఈటలకు మద్దతుగా ప్రముఖ నాయకులెవరూ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు.

సర్వేపై ధీమాతో అభ్యర్థిగా ప్రకటన..

హుజూరాబాద్‌లో విజయావకాశాలు అనుకూలంగా ఉన్నాయని నిఘా సంస్థల ద్వారా సమాచారం అందుకున్నందునే అభ్యర్థిగా ఈటల పేరును కేంద్ర నాయకత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ టికెట్‌ ఎవరికి వస్తుందో క్లారిటీ లేదు. ఈటల రాజేందర్ పోటీ చేస్తారా లేక తాను పోటీ చేస్తానా అనేది పార్టీ తీసుకునే నిర్ణయం అంటూ గతంలో ఈటల జమున వ్యాఖ్యానించారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం ప్రచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా సర్వే ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఈటల రాజేందర్ గెలుపు ఖాయమనే క్లారిటీ రావడంతో ఇప్పుడు అధికారికంగానే ఆయనను అభ్యర్థిగా ప్రకటించినట్లు ఆ పార్టీలో టాక్ వినిపిస్తున్నది.

పాదయాత్ర ఎఫెక్ట్ హుజూరాబాద్‌లో తప్పకుండా ఉంటుందని, బండి సంజయ్ ఈ నెల 30వ తేదీ వరకు ప్రచారంపైనే దృష్టి పెడతారని, కేంద్ర నాయకత్వం కూడా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర కార్యాలయ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతానికి బండి సంజయ్ ప్రచార క్యాంపేయిన్ గురించి, స్టార్ క్యాంపేయినర్ల గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ హుజూరాబాద్ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం నుంచి పూర్తి సమాచారం, అండదండలు, ఆశీస్సులు, ఆదేశాలు ఉండటంతో ఇకపైన బండి సంజయ్ దూకుడును ప్రదర్శిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

హుజూరాబాద్‌లో ఇప్పటివరకూ జరిగిన ప్రచారమంతా దాదాపుగా ఈటల ఒక వ్యక్తిగా, పార్టీ తరఫున ఇన్‌ఛార్జి తదితరులు మాత్రమే భుజాన వేసుకున్నారు. కానీ ఇకపైన మాత్రం పార్టీ నాయకత్వం ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నది. బండి సంజయ్ పాదయాత్ర విషయంలో అంటీముట్టనట్లుగా ఉన్న రాష్ట్ర నాయకులు ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలోనూ అదే వైఖరితో ఉంటారా లేక యాక్టివ్‌గా పాల్గొంటారా అనే చర్చలు జరుగుతున్నాయి. ఎలాగూ కేంద్ర నాయకత్వం ప్రత్యేక చొరవ తీసుకున్నందున రాష్ట్ర నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి సమిష్టి కృషితో హుజూరాబాద్‌ను గెలిపించుకోవాలన్న టాస్కును అప్పజెప్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story