బాబా కా దాబా వైరల్ మీమ్స్!

by Shamantha N |   ( Updated:2020-11-07 06:52:09.0  )
బాబా కా దాబా వైరల్ మీమ్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆయన ఏడుపును చూసి సోషల్ మీడియా తట్టుకోలేకపోయింది. ఆయనకు సాయపడాలని ఆరాటపడింది. ఆయన కష్టాన్ని సెలెబ్రిటీల వరకు చేరేలా చేసింది. సాయాన్ని అందించి, ఆయన జీవితంలో ఎన్నడూ ఎరగని మార్పును తీసుకొచ్చింది. ఇంత చేసిన సోషల్ మీడియా ఇప్పుడు ఆయనను తప్పుబడుతోంది. డబ్బు రాగానే జనాలు మారిపోతారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అవమానిస్తోంది. కొన్ని జీవితాలను మార్చకుండా వదిలేయడమే మంచిదని వాదిస్తోంది. మరి ‘బాబా కా దాబా’ యజమాని కాంతా ప్రసాద్ మీద సోషల్ మీడియా ఎందుకిలా ప్రవర్తిస్తోందంటే..

‘బాబా కా దాబా’ గురించి సోషల్ మీడియాకు తెలియడానికి కారణం యూట్యూబర్ గౌరవ్ వసన్. కానీ గౌరవ్ తమ పేరు వాడుకుని రూ. 20 లక్షల వరకు డబ్బును పోగేసుకున్నాడని, తమకు మాత్రం కేవలం రూ. 2 లక్షలే ఇచ్చాడని కాంతా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తామేమీ గుర్తింపు కోసం గౌరవ్ దగ్గరకు వెళ్లి అడగలేదని, ఆయనే స్వయంగా వచ్చి తమ పరిస్థితిని వాడుకున్నాడని కాంతా ప్రసాద్ మీడియాకు చెప్పాడు. ఇప్పుడు గౌరవ్ వసన్ మీద మాళవీయ నగర్ పోలీసులు చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. సాయం చేయడానికి పోయి, ఇలా చిక్కుల్లో పడ్డాడంటూ గౌరవ్ వసన్ మీద సోషల్ మీడియా సానుభూతి చూపిస్తూనే, బాబా కా దాబా కాంతా ప్రసాద్ గురించి ఫన్నీ మీమ్‌లను వైరల్ చేస్తోంది. వాటిలో ఒక మీమ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మీమ్‌లో బాబా కా దాబా పాపులర్ అవడానికి ముందు కాంతా ప్రసాద్ ఏడ్చిన ఫొటోను, పాపులర్ అయ్యాక కళ్లద్దాలు పెట్టుకుని ఆటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడుతున్న ఫొటోను పక్కపక్కన పెట్టి ‘అప్పు తీసుకునే ముందు, అప్పు తీసుకున్న తర్వాత’ అని ట్యాగ్‌లు పెట్టారు. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పు అనే విషయంలో అటు మానవత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా విశ్వాస ఘాతుకంగా పరిగణించాలో తెలియని పరిస్థితిలో నెటిజన్లు కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed