ఆర్డర్లు పెరిగినా డెలివరీలో ఆటంకాలు -టయోటా కిర్లోస్కర్

by Harish |
ఆర్డర్లు పెరిగినా డెలివరీలో ఆటంకాలు -టయోటా కిర్లోస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. కానీ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) ల వంటి ఆర్థిక సంస్థలతో ఉన్న సున్నిత సమస్యల వల్ల డెలివరీలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ (Automobile) తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్‌లోని సీనియర్ అధికారి తెలిపారు. పండుగ సీజన్ మొదలవడంతో జులైతో పోలిస్తే ఆగష్టులో 30 శాతం అధిక ఆర్డర్లను చూడగలిగామని ఆయన తెలిపారు.

జులైతో పోలిస్తే ఆర్డర్ల సంఖ్య చాలా ఎక్కువ. అయితే, తాము బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో సహా ఆర్థిక సంస్థలతో చిక్కులను ఎదుర్కొంటున్నామని టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ చెప్పారు. ఆర్డర్స్ విషయంలో తాము సంతృప్తిగా ఉన్నాం. ప్రతిరోజూ కొత్త ఆర్డర్లను తీసుకోవడంలో కంపెనీకి మంచిదే అయినప్పటికీ, ఖచ్చితమైన డెలివరీలను ఇవ్వడం కూడా ముఖ్యం. ఆర్థిక సంస్థలతో ఉన్న సమస్యల కారణంగా ఆర్డర్లను తీసుకున్నంత వేగంగా డెలివరీలను చేయలేకపోతున్నామని ఆయన వివరించారు.

ఉదాహరణకు.. పదేళ్ల క్రితం తక్కువ మొత్తానికి రుణ ఎగవేతదారులుహా మారిన కస్టమర్లకు ఇప్పుడు రుణాలు తీసుకోవడం కష్టంగా మారింది. వినియోగదారుల క్రెడిట్ స్కోరు అయిన సిబిల్ స్కోర్ కారణంగా నిర్దిష్ట కాలంలో 80 శాతం రుణానికి అర్హులుగా ఉన్న వినియోగదారులు ప్రస్తుతం 60 శాతం మాత్రమే పొందుతున్నారని నవీన్ సోనీ వివరించారు. ఈ క్రమంలో ఫైనాన్స్ కంపెనీలు ఈ రుణాలపై సున్నితంగా వ్యవహరిస్తున్నారు.

ఓ రకంగా మితిమీరిన జాగ్రత్త, సున్నితత్వం వల్ల మార్కెట్ నెమ్మదించింది. ఆయా కస్టమర్లపై ఫైనాన్స్ కంపెనీలు జాగ్రత్త వహించడమే దీనికి కారణమని నవీన్ పేర్కొన్నారు. బాధ్యతారహితంగా రుణాలు ఇవ్వాలని ఆటో కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలను కోరడం లేదని, కానీ కారు రుణాలు పొందడానికి అర్హత కలిగిన వినియోగదారుల విషయంలో స్థిరత్వం అవసరమని అన్నారు. పైగా, కొవిడ్-19, లాక్‌డౌన్ కారణంగా రుణాలను ఆమోదించేందుకు, మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశోధనలకు సమయం పెరిగిందని నవీన్ సోనీ గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed