గబ్బర్, పాండ్యా పోరాటం వృథా.. ఆసీస్ విజయం

by Anukaran |
గబ్బర్, పాండ్యా పోరాటం వృథా.. ఆసీస్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆటగాళ్లు కెప్టెన్ ఫించ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో వీరవిహారం చేశారు. ఫించ్(124 బంతుల్లో 114), స్మిత్ (66 బంతుల్లో 105), వార్నర్ (76 బంతుల్లో 69), మాక్స్‌వెల్ (19 బంతుల్లో 45) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 374 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత్ ఎదుట 375 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అయితే.. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆటగాళ్లు ఆసీస్ బౌలర్లకు వరుస వికెట్లు సమర్పించుకున్నారు. 101 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. మయాంక్ అగర్వాల్ (22), కోహ్లీ (21), శ్రేయాస్ అయ్యర్ (2), కేఎల్ రాహుల్ (12) పరుగులకే ఔటై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు. అనంతరం క్రీజులో కుదురుకున్న శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యాలు నెమ్మదిగా బ్యాట్ ఝళిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించారు.

అయితే.. అప్పటివరకు నిలకడగా ఆడిన ధవన్ 86 బంతుల్లో 74 కొట్టి అవుటయ్యాడు. ఆ తర్వాత జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పాండ్యా 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. చివరగా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత ఆటగాళ్లు 308 పరుగులు చేసి ఓటమి చెందారు. దీంతో భారత్-ఆసీస్‌ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా 01-00తో ఆధిక్యంలోకి వెళ్లింది. కరోనా కారణంగా 269 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కోహ్లీసేన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చెందడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Advertisement

Next Story

Most Viewed