ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీ.. ఘోర ప్రమాదంలో 32 మంది మృతి

by Anukaran |
egypt train accident
X

దిశ, వెబ్‌డెస్క్: ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 32 మంది చనిపోయారు. ఈజిప్టులోని సోహాగ్ ప్రావిన్సులో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఈజిప్టులోని దక్షిణాది నగరం లగ్జర్ నుంచి అలగ్జ్రాండియా వెళ్తున్న ప్యాసింజర్ రైలు.. ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ప్యాసింజర్ రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 32 మంది ప్రయాణికులు ఘటనాస్థలిలోనే మరణించారు. మరో 162 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది అపస్మారక స్థితిలోనే ఉన్నారని, గాయాల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 80 అంబులెన్స్‌లు, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈజిప్టు ప్రధాని ముస్తఫా ప్రమాదం జరిగిన చోటును సందర్శించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

ఈజిప్టులో మౌళిక వసతుల కొరత అక్కడి రోడ్డు, రైలు రవాణాకు శాపంగా మారింది. మౌలిక వసతుల నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ రైలు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

ఒక నివేదిక ప్రకారం.. 2017 నుంచి ఇప్పటివరకు ఈజిప్టులో 1,793 రైల్వే ప్రమాదాలు సంభవించాయంటే అక్కడ రైల్వేల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2002లో జరిగిన ఒక రైలు ప్రమాదంలో ఏకంగా 373 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed