గొర్రెలను గెలిపించారు.. వైసీపీ ఎంపీలపై అచ్చెన్నాయుడు

by srinivas |
Tdp president Atchannaidu
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. వారు ఎంపీలు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు 22 మంది గొర్రెలను గెలిపించారంటూ వైసీపీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఈ ఎంపీలు ప్రజల కోసంగానీ… రాష్ట్ర ప్రయోజనాల కోసం గానీ పోరాటం చేయడం లేదని విమర్శించారు. విజయనగరం జిల్లాలో మంగళవారం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తామన్నారు. స్థానిక ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉంటుందన్నారు.

ప్రజలు ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. వైసీపీ డబ్బు పెట్టి గెలవాలని చూస్తోందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కొండమీద కూర్చొన్న సీఎం వైఎస్ జగన్ పొగరు దించాలంటే తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలవాలన్నారు. విజ్ఞులైన తిరుపతి ఓటర్లు న్యాయం, ధర్మం కోసం టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నెల్లూరులో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్‌ వేస్తున్నారని చెప్పుకొచ్చారు.

సంక్షేమ కార్యక్రమాల పేరిట వైసీపీ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి.. ప్రజల నుంచి 100 రూపాయలను లాగేసుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ‘టీడీపీ తరపున మూడు పులులు ఉన్నాయి.. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో నిరంతరం మూడు పులులు గళం విప్పుతున్నాయి.. అదనంగా మరో పులిని చేర్చండి’ అని అచ్చెన్నాయుడు ప్రజలను కోరారు.

Advertisement

Next Story