ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. పెళ్లైన అమ్మాయిలు కూడా అర్హులే

by srinivas |   ( Updated:2021-03-07 00:37:05.0  )
ap highcourt
X

దిశ వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కారుణ్య నియామకాలకు పెళ్లైన అమ్మాయిలు కూడా అర్హులేనని సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది మే 20న కారుణ్య నియామకాలకు సంబంధించి ఏపీ‌ఎస్‌ఆర్టీసీ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టేసింది. ఒక ఉద్యోగి మరణించినప్పుడు వారి స్థానంలో ఆ కుటుంబంలోని కుమారుడికి, పెళ్లికాని కుమార్తె‌కు మాత్రమే ఇప్పటివరకు ఉద్యోగం ఇచ్చేవారు.

కుటుంబంలో పెళ్లైన అమ్మాయి ఉంటే ఉద్యోగం వచ్చేది కాదు. ఇప్పుడు ఈ నిబంధనను హైకోర్టు కొట్టివేసింది. అమ్మాయిల విషయంలో వివక్ష ఎందుకుని ప్రశ్నించింది. కుమారుడు విషయంలో లేని నిబంధన కూతురు విషయంలో ఎందుకుని ప్రశ్నించింది. పెళ్లయిందన్న కారణంతో కుమార్తె పుట్టింటి కుటుంబంలో సభ్యురాలు కాదనడం రాజ్యంగ విరుద్దమని హైకోర్టు పేర్కొంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ దయమంతి తండ్రి ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోయారు. దీంతో కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం కల్పించాలని కోరుతూ దయమంతి దరఖాస్తు చేసుకోగా.. పెళ్లైందనే కారణంతో ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా… హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది. ఆమెకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది.

Advertisement

Next Story