- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనువుగా ఉంటూనే అలా చేస్తుంది
తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందంటూనే ఏపీ భారీ ప్రాజెక్టులు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. చనువుగా ఉంటూనే ఘరానా మోసానికి తెర లేపుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి జలాలను తరలించుకుపోయేందుకు కుట్రలు చేస్తోంది. అందుకు తగిన ప్రతిపానలకూ రూపకల్పన చేసింది. అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. తెలంగాణ అభ్యంతరాలను పెడ చెవిన పెడుతోంది. ‘తనకు మాలిన ధర్మం లేదు’ అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
దిశ, న్యూస్ బ్యూరో: పోలవరం కుడికాల్వ సామర్థ్యం పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డుకు తాజాగా లేఖ రాసిన విషయం తెలిసిందే. గోదావరిలో మిగులు జలాల వాటా తేలడం లేదని, దీనిపై కేంద్రం పరిధిలో వాదనలు జరుగుతున్నాయని, ఈ సమయంలో పనులు చేయకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అందులో కోరింది. అంతకు ముందు కృష్ణా జలాల తరలింపులో భాగంగా పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంచడానికీ ఏపీ చేసిన యత్నం మీదా, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం మీదా తెలంగాణ అభ్యంతరం తెలిపింది. దీంతో జల వివాదాలు రాజుకున్నాయి. ఏపీ ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. ఇపుడు మరో భారీ నిర్మాణానికి పావులు కదుపుతోంది. దీని గురించి గత నెలలో జరిగిన అసెంబ్లీలోనే ఏపీ గవర్నర్ ప్రసంగంలో చెప్పించింది. త్వరలోనే టెండర్ల ఖరారుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం దీని కోసం రూ.80 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ పెంపునకు రూ.12,700 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో వివరించింది. ఇక్కడ నుంచి లైనింగ్, సామర్థ్యం పెంపునకు టన్నెల్స్, ఏడు చోట్ల లిప్టులు, భారీ రిజర్వాయరు నిర్మాణం కోసం రూ.67,300 కోట్లు ఖర్చు అవుతాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
300 టీఎంసీల గోదావరి నీటి తరలింపు
పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా గోదావరి జలాలను రాయలసీమ, పల్నాడుకు తరలిస్తామని ప్రకటించుకుంది. ప్రస్తుతం పోలవరం కుడి కాలువ వెడల్పు 85.5 మీటర్లు కాగా, లోతు 5 మీటర్లు, ప్రవాహ సామర్థ్యం 17,633 క్యూసెక్కులు ఉంది. కాలువ పొడవు 174 కి.మీ. కాగా, కుడి కాలువ కింద 3.2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వైఎస్సార్ సీఎంగా ఉండగా 2004లో కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా పథకానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం కుడి కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచాలంటే కాలువను 181 మీటర్లు వెడల్పు చేయడంతోపాటు లోతును ఆరు మీటర్లకు పెంచాల్సి ఉంటుంది. కాలువ కుడి వైపున 95.5 మీటర్లు విస్తరించడం ద్వారా 181 మీటర్లకు వెడల్పు చేయనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు కొత్తగా 1,757 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును కుడి కాలువకు అనుసంధానం చేసే కనెక్టివిటీలో జంట సొరంగాల సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఏపీ జలవనరుల శాఖ తాజాగా ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు.
రెండు టన్నెళ్ల సామర్థ్యం పెంచుతూ
ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీ ద్వారా తరలించే 50 వేల క్యూసెక్కులను నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాలువ, పల్నాడు, వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేలా ప్రణాళిక చేసుకున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టులో కుడివైపు నీళ్లను మళ్లించేందుకు వీలుగా నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల సామర్థ్యం పెంచేందుకు ఇప్పటికే అన్నీ సిద్ధం చేశారు. 64,65 ప్యాకేజీలుగా టన్నెల్ తవ్వకం పనులు నిర్దేశిత కొలతల ప్రకారం పూర్తయ్యాయి. లైనింగ్ చేయాల్సి ఉంది. గోదావరి నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు మళ్లించేలా ఈ టన్నెళ్లను ముందుగా డిజైన్ చేశారు. అయితే, 50 వేల క్యూసెక్కుల వరకు మళ్లించేందుకు అనువుగా సామర్థ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి- బనకచర్ల (పెన్నా) అనుసంధానంలో భాగంగానే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గోదావరి వరద జలాలను కృష్ణా మీదుగా బనకచర్ల రెగ్యులేటర్ (పెన్నా)కు మళ్లించే ప్రతిపాదనపై వ్యాప్కోస్ అధ్యయనం పూర్త చేసింది. ప్రస్తుతం 2 టన్నెళ్లు 11.8 మీటర్ల డయా (వ్యాసార్థం)తో సిద్ధం చేశారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం 2 టన్నెళ్లు 17 మీటర్ల వ్యాసార్థంతో తవ్వేలా మార్పు చేసేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్త చేస్తున్నారు. ఆ కారణంతోనే టన్నెళ్ల లైనింగ్ పనులు పెండింగ్‌లో పెట్టినట్లు ఏపీ చెప్పుకొంటోంది. కొత్త కొలతల ప్రకారం టన్నెళ్లను సిద్ధం చేయాలంటే రూ.782 కోట్లు అవుతుందని అంచనా వేసి పెంచుతున్నారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండే పోలవరం దగ్గర 120 రోజుల పాటు 300 టీఎంసీలను తరలించే అవకాశాలు ఉండటంతో ఏపీ ఈ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలొ భాగంగా గోదావరి నీళ్లను నిల్వ చేసుకునేందుకు 200 టీఎంసీలతో ప్రకాశం జిల్లాలో భారీ రిజర్వాయరును నిర్మించాలని ఏపీ ప్రతిపాదనల్లో పేర్కొంది.
ఎత్తిపోతల పథకం ద్వారా
మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని రాయలసీమకు తరలించేందుకు బ్యారేజీ ఎగువన హరిశ్చంద్రపురం సమీపంలో ఎత్తిపోతలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి రోజుకు రెండు టీఎంసీలను సాగర్ కుడి కాల్వలోకి ఎత్తిపోయనున్నారు. కుడికాల్వ 81వ కిలోమీటరు సమీపంలో ఈ ఆయకట్టుకు నీటిని అందించి, ప్రకాశం జిల్లా బొల్లేపల్లి రిజర్వాయరుకు అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా దిగువలోకి బనకచర్లకు తరలించే విధంగా ప్రతిపాదనలు చేశారు. మొత్తం పోలవరం నుంచి పెన్నా బేసిన్‌కు 560 కిలోమీటర్లు నీటిని తరలించనున్నారు. మొత్తం ఏడు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ తరలింపులో ప్రకాశం దగ్గర మినహాయిస్తే గోదావరి జలాలు కృష్ణాలో కలువకుండానే పెన్నాకు వెళ్తున్నాయి.
రాయలసీమకు అడ్డు లేకుండా
ఇటు కృష్ణాపై నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా ఉంది. ఎన్జీటీ నుంచి నోటీసులు రావడంతో అఫిడవిట్ దాఖలు చేసింది. పర్యావరణంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, అటవీ ప్రాంతాలు ఉండవని, రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలనడం ఎన్జీటీకి సంబంధం లేదని అందులో పేర్కొంది. రాయలసీమ, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు పనులను నిలిపివేయాలని బోర్డు కూడా లేఖ రాసింది. ఎన్జీటీ నోటీసుల ఆధారంగానే పనుల టెండర్లను పెండింగ్‌లో పెట్టినట్లు ఏపీ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎన్జీటీ నుంచి సమాధానం రాగానే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టనుంది. దీనికి తోడుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు పనులకు కూడా టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తోంది. తొలుతగా రూ. 6500 కోట్లతో ఈ పనులు చేయనున్నారు. ఇలా ఎగువ రాష్ట్రం ప్రయోజనాలు, అవసరాలను పట్టించుకోకుండా ఏపీ రెండు నదుల నీళ్లను దిగ్భంధనం చేసే ప్రాజెక్టులను నిర్మించనుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తున్నా అవి బోర్డులకే పరిమితమవుతున్నాయి. జల వివాదాలపై అపెక్స్ ఉంటుందని భావించినా కరోనా పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కావడం లేదు. ఈలోగా ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, పనులను మొదలుపెట్టాలనే లక్ష్యంతో ఏపీ జలవనరుల శాఖ ప్రయత్నాలు చేస్తోంది.