మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.. కాన్వాయికి అడ్డంగా..!

by Anukaran |   ( Updated:2021-07-09 10:36:52.0  )
మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.. కాన్వాయికి అడ్డంగా..!
X

దిశ, మేడిపల్లి : రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలపైన బీజేవైఎం యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఆదేశాల మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ డిపో వద్ద బిక్షాటన చేస్తున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న మంత్రి మల్లారెడ్డి కాన్వాయిని బీజేవైఎం నాయకులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.

దీంతో బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బండారు పవన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం పై స్పష్టత కోసమే మంత్రిని నిలదీసే ప్రయత్నం చేయగా మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బంది, పోలీసులు బీజేవైఎం నాయకులపై పాశవికంగా దాడి చేశారని అన్నారు. తెరాస ప్రభుత్వం గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిందని, కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని కానీ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు లేవని ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివ శంకర్, వాసుదేవ రెడ్డి, మహేందర్ రెడ్డి, నవనీత, అనురాధ, మాధవి, నరేష్, సంతోష్ రెడ్డి, సాయి రామ్ రెడ్డి, గుణాకర్ గౌడ్, పవన్ జస్వంత్ గౌడ్, వంశీ, మోహన్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story