'మా'లో చీలిక.. పోటీగా కొత్త అసోసియేషన్?

by Shyam |   ( Updated:2021-10-12 05:16:12.0  )
maa news
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ హాట్‌గా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినా.. ఇంకా వేడి చల్లారడం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత విబేధాలు మరింతగా ముదిరిపోయాయి. పైకి తామందరం ఒక్కటేనని సినీ ప్రముఖులు చెబుతున్నా.. లోలోపల మాత్రం కోల్డ్ వార్ హీట్ పుట్టిస్తోంది. మాలో అంతర్గత కుమ్ములాటలు పీక్ స్టేజ్‌కి చేరుకున్నాయి. రెండు గ్రూపులుగా వీడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. మంచు విష్ణు మా ప్రెసిడెంట్‌గా గెలుపొందటంతో.. ప్రత్యర్థి వర్గమైన ప్రకాష్ రాజ్, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదు. గతంలో రాజేంద్రప్రసాద్ పై జయసుధ ఓటమిపాలైంది. అలాగే నరేష్ పై శివాజీరాజా ఓటమి చెందారు. అయితే వారెవరూ రాజీనామా చేయలేదు. కానీ ఇప్పుడు మాలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల తర్వాత కూడా విబేధాలు ముగిసిపోవడం లేదు. మంచు విష్ణు ప్రెసిడెంట్ గా విజయం సాధించడంతో.. ప్రత్యర్థి వర్గమైన ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామా చేయడంతో ‘మా’ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు అర్ధమవుతోంది.

ఈ క్రమంలో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. ‘మా’లో చీలికలు రానున్నాయని, ‘మా’కు సమాంతరంగా ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ATMAA) పురుడుపోసుకోనుందనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సాయంత్రం 5 గంటలకు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కొత్త అసోసియేషన్ గురించి ప్రకటన చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story