కడప- బెంగళూరు రైల్వే లైన్ వద్దంటూ జగన్ లేఖ.. ఆగ్రహం వ్యక్తం చేసిన పురంధేశ్వరి

by srinivas |   ( Updated:2023-11-02 12:14:19.0  )
కడప- బెంగళూరు రైల్వే లైన్ వద్దంటూ జగన్ లేఖ.. ఆగ్రహం వ్యక్తం చేసిన పురంధేశ్వరి
X

దిశ, వెబ్ డెస్క్: కడప-బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనులు ప్రారంభించారు. అయితే వైఎస్సార్ మరణం, రాష్ట్ర విభజన తర్వాత ఈ రైల్వే లైన్ పనులు ముందుకు సాగలేదుే. ఇక చంద్రబాబు హయాంలో అసలు ఆ ప్రవస్తానే రాలేదు. అయితే 2019లో జగన్ సీఎం అవగానే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన రైల్వే లైన్ పనులు ప్రారంభమవుతాయని కడప జిల్లా ప్రజలు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయారు. ఆ రైల్వే లైన్ వద్దంటూ కేంద్ర రైల్వే శాఖకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనూహ్యంగా లేఖ రాశారు. దాంతో ఆ రైల్వే లైన్ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ అంశాన్నే ఏపీ బీజేపీ అనూహ్యంగా తెరమీదకు తెచ్చింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓ అస్త్రంగా సీఎం జగన్‌పై ప్రయోగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై విమర్శలు చేసిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పుడు కడప రైల్వే లైన్‌పై జగన్ తీరును తప్పుబడుతూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించారు. పార్టీ బలోపేతంపై బీజేపీ కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ఆమె విమర్శలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెగ గొప్పులు చెప్పుకుంటున్నారని, అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లవుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు గేటు నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. రాజంపేటకు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని పురంధేశ్వరి ధ్వజమెత్తారు. ప్రతి ఏడాది వెనక బడిన ప్రాంతాలకు కేంద్రం రూ.350 కోట్లు మంజూరు చేస్తుంటే కనీసం రహదారులు కూడా వేయడంలేదని విమర్శించారు. ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా సహరిస్తోందని.. కానీ అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్ విఫలమవుతోందని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేకపోయారని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed