భారీగా వరద.. పాపికొండల విహార యాత్రకు బ్రేక్

by srinivas |
భారీగా వరద.. పాపికొండల విహార యాత్రకు బ్రేక్
X

దిశ, గోదావరి జిల్లాల ప్రతినిధి: ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో గోదావరి ప్రవాహం క్షణక్షణానికీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరటంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో పాపికొండల యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పి.గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజ్ వేలు పూర్తిగా నీట మునిగాయి. జనం నాటుపడవలపై ప్రయాణం సాగిస్తున్నారు.

పల్లెలను ముంచెత్తిన వరద..

అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో పలు గ్రామాలను వరద ముంచెత్తింది. చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.వీఆర్‌ పురం మండలంలోని ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి,అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సీతానగరం మండలంలోని ములకల్లంక, రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురులంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed