Visakha: ఎన్నికల ముందు సీఎం జగన్ మరో మోసం..!

by srinivas |   ( Updated:2023-12-09 12:06:34.0  )
Visakha: ఎన్నికల ముందు సీఎం జగన్ మరో మోసం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మరో మోసానికి తెరలేపారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1,గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడాన్ని గంటా తప్పుబట్టారు. ఇన్ని రోజులు నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు నోటిఫికేషన్లు అంటూ సీఎం జగన్ మరో మోసానికి పాల్పడుతున్నారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల భర్తీపై జగన్ సర్కార్‌కు చిత్తశుద్ది లేదని, అందుకే ఎన్నికలకు 6 నెలల ముందు నోటిఫికేషన్లు విడుదల చేశారని మండిపడ్డారు. ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్లు విడుదల చేసి ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తానడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకూ అదిగో డీఎస్సీ, ఇదిగో డీఎస్సీ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు పెంచారని.. చివరకు ఆ ఊసే లేకుండా చేశారని గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.


‘గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్ల ప్రకారం ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్-1, గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. ఇదంతా ప్రభుత్వానికి తెలిసే నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

Advertisement

Next Story