- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పద్మవ్యూహంలో పొలిటికల్ చాణుక్యుడు.. 'గంటా'మౌనం వెనుక?
- ఈ 16నెలల్లోనైనా మోగుతారా? మూగబోతారా?
- టీడీపీలోనే కొనసాగుతారా? లేక పక్కచూపులు చూస్తారా?
- జనసేనతో టచ్‌లో..బీజేపీతో మంతనాలే కొంపముంచాయా?
దిశ, డైనమిక్ బ్యూరో: ఆయన రాజకీయ ప్రస్థానం కాస్త అందరికంటే భిన్నంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో పుట్టి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వ్యాపార వేత్త నుంచి పొలిటీషియన్‌గా మారి సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు మూడు పార్టీలు మారినా గెలుపు మాత్రం ఆయనదే. పోటీ చేసిన ప్రతీసారి నియోజకవర్గం మార్చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలవడం మాత్రం పక్కా. ఇది ఇప్పటకీ ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఓ మిస్టరీగానే ఉంది. ఇకపోతే ఏ పార్టీలో ఉన్నా ఉన్నత పదవులు వరించడం కూడా ఆయన ప్రత్యేకత. ఇంతకీ ఆ నేత ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ..ఇంకెవరు మాజీమంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ వేవ్‌ను సైతం తట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో గంటా మౌనం వహిస్తున్నారు. మధ్యలో అడపాదడపా నేనున్నానంటూ రాజకీయాల్లో ముఖం చూపిస్తూ మళ్లీ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతున్నారు. మరో 16 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఇకనైనా అజ్ఞాతవాసం వీడుతారా?. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారా? లేక వేరే నియోజకవర్గం మారుస్తారా?. ఇంతకీ టీడీపీలో ఉంటారా? లేక జనసేనలోకి జంప్ అవుతారా? ఇవే ప్రశ్నలు విశాఖ వాసుల మదిని తొలచివేస్తున్నాయి.
అంతుచిక్కని గంటా వ్యూహం
గంటా శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాంధ్ర కాకపోయినా అక్కడే సెటిలై రాజకీయ చక్రం తిప్పేవారు. పార్టీ ఏదైనా.. పదవి ఏదైనా.. ఆయన ఉండేది మాత్రం అధికార పార్టీలోనే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకనేతగా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లో నేను సైతం అంటూ సీనియర్లను కూడా పక్కనపెట్టి దూసుకెళ్లిపోయారు. అలాంటి గంటా శ్రీనివాస రావు మూడున్నరేళ్లుగా మౌనం వహిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందినప్పటికీ ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైసీపీలో చేరేందుకు పావులు కదిపారని ప్రచారం జరిగినా దాన్ని కొట్టి పారేయ్యలేదు. అలాగే బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపించిన పట్టించుకోలేదు. జనసేన పార్టీలో చేరతారని అందుకే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారని గుసగుసలు వినిపించినా గమ్మునుండిపోయారే తప్ప పెదవి విప్పడం లేదు. దీంతో గంటా భవిష్యత్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అసలు గంటా మదిలో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. వారికి అంతుచిక్కడం లేదు. ఎందుకు గంటా అంత రహస్యంగా రాజకీయం చేస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. అంతేకాదు గంటా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక వారసుడిని బరిలోకి దించుతారా అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే టీడీపీలో కొనసాగలేక గంటా శ్రీనివాసరావు దిక్కులు చూస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జనసేనతో టచ్‌లో ఉంటూనే బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. వీటన్నింటికి ముగింపు పలకాలంటే గంటా శ్రీనివాసరావు నోరు విప్పాల్సిందే.
కేసుల భయమా ?
గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారి 1999లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో మంత్రిగా చాన్స్ కొట్టేశారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు ఏకంగా చంద్రబాబు కేబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు రాజకీయంగా దూకుడు ప్రదర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిమ్మనకుండా ఉండిపోయారు. తొలుత వైసీపీలో చేరేందుకు పావులు కదిపారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అవి బెడసి కొట్టడంతో ఇక సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. మరోవైపు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటే వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతుందని భావించి సైలెంట్ అయిపోయారని ప్రచారం జరుగుతుంది.
ఏం చేయలేని చంద్రబాబు
ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు రాజకీయ చాణుక్యుడు అని పలువురు అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో తడబడుతున్నాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం. కేసుల భయమో లేక అధికారంలో లేము కదా అని ఎందుకో తెలియదు కానీ మూడున్నరేళ్లు అయితే సైలెంట్ అయిపోయారు. లేకపోతే ఖర్చు తగ్గించుకునేందుకో గానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కిక్కిరి మనలేదు. కనీసం గంటాను ఒక్కమాట కూడా అనలేదు. యాక్టివ్ కావాలి.. పోరాడాలి అని అందరికీ చెప్పిన చంద్రబాబు గంటాతో మాత్రం చెప్పలేదు సరికదా ఆయనను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే మాజీ మంత్రి నారాయణ వియ్యంకుడు కావడమే అందుకు కారణం. టీడీపీలో కనిపించని పవర్ సెంటర్‌గా మాజీమంత్రి నారాయణ వ్యవహరిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. గంటా శ్రీనివాసరావుకు స్వయానా నారాయణ వియ్యంకుడు కావడంతో ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. అంతేకాదు రాష్ట్రంలోని పలువురు కీలక నేతలతో సైతం గంటాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలోని 15కిపైగా నియోజకవర్గాల్లో గంటాకు పట్టుంది అని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో గంటాని కదిపితే తేనే తుట్ట కదిపినట్లవుతుందని భావించిన చంద్రబాబు ఇక ఆయన జోలికి అయితే వెళ్లడం లేదు.
టీడీపీలో మాత్రమే రెడ్ కార్పెట్
ఇకపోతే వైసీపీ పాలనలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మెుత్తం విశాఖను వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు చేతుల్లోకి తీసుకోవడంతో ఎక్కడ కూడా తన పెత్తనం చెల్లుబాటు కావడం లేదనే గంటా మదనపడుతున్నారట. ఈ నేపథ్యంలో తానంటే ఏంటో చూపించుకోవాలని గట్టిగానే ప్లాన్స్ వేస్తున్నప్పటికీ అవన్నీ బెడిసికొడుతున్నాయి. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన గంటాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీడీపీ పరిస్థితి అయోమయంగానే ఉంది. వైసీపీని ఢీకొట్టడంలోనూ.. ప్రతిపక్ష పార్టీగా విఫలమైందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని జనసేన, బీజేపీలతో గంటా టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా కులం కార్డును సైతం ఉపయోగించారు. అన్ని పార్టీలలో ఉన్న కాపు నేతలతో జరిగిన సమావేశాలకు సైతం గంటా హాజరయ్యారు. మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అది కూడా రక్తికట్టలేదు. దీంతో గంటా శ్రీనివాసరావు రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో పాలుపోలేని స్థితిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. వైసీపీ రానివ్వదు. బీజేపీ, జనసేనలో చేరాలా వద్దా అనే మీమాంస. ఇవన్నీ ఎలా ఉన్నా ఎప్పుడు వెళ్లినా టీడీపీలో మాత్ర రెడ్ కార్పెట్ పరిచి ఉంటుందనే ధీమా ఇదొక్కటే గంటాకు మిగిలిందని పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
READ MORE