అనుమానాస్పద స్థితిలో గిరిజనుడు మృతి

by sudharani |
అనుమానాస్పద స్థితిలో గిరిజనుడు మృతి
X

దిశ, కర్నూలు ప్రతినిధి : దొంగతనానికెళ్లిన ఓ గిరిజనుడు రెండు వారాల తర్వాత అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామంలో గురువారం వెలుగులోకొచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందికుంట గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశ్వర్లు (23) అనే గిరిజనుడు, ఎర్రకుంట గూడేనికి చెందిన లింగమయ్య, లింగమ్మ, అంకమ్మతో కలిసి ఈ నెల 14 వ తేదీ రాత్రి నందికుంట గ్రామంలోని ఓ రైతుకు చెందిన పొలంలో కూరగాయలు దొంగిలించేందుకు వెళ్లారు.

విద్యుత్ తీగలు తగిలి..

అక్కడ పొలానికి కాపలాగా ఉన్న యానాదులు అడవి పందుల సంచారం ఉందనే నెపంతో కరెంట్ కంచెను ఏర్పాటు చేశారు. విద్యుత్ తీగలకు నిమ్మల వెంకటేశ్వర్లుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన మరో ముగ్గురు భయాందోళనతో పరారయ్యారు. కరెంట్ ఏర్పాటు చేసి కాపలా ఉన్న యానాదులు కూడా భయపడి అక్కడున్న కంచె తీసేసి విషయాన్ని పొలం యజమానికి తెలియజేశారు. యజమాని వారికి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో మృతదేహాన్ని దుద్యాల సమీపంలో ఉండే భవనాశి వాగులో పడేశారు. భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన మృతుడి భార్య శివమ్మ ఈ నెల 17న కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

భార్య ఫిర్యాదుతో విచారణ

ఈ మేరకు కొత్తపల్లి ఎస్ఐ ముబీనా తాజ్ ఎర్రకుంటకు చెందిన అనుమానిత గిరిజనులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు మండలంలోని కురుకుంద గ్రామానికి చెందిన దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించగా.. తీగలు తగలడంతోనే మృతి చెందాడని, భవనాశి వాగులో మృతదేహాన్ని పడేశామని ఒప్పుకున్నారు. పొలం యజమాని కూడా నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఆత్మకూరు సీఐ సుబ్రమణ్యం, కొత్తపల్లి ఎస్ఐ ముబీనా తాజ్ సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతి చెంది రెండు వారాలు కావడంతో వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని సీఐ తెలిపారు.

నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి

కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ నాయక్ డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

Advertisement

Next Story