శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం..ఈనెల 19న గరుడోత్సవం

by Seetharam |
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం..ఈనెల 19న గరుడోత్సవం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల గిరులు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 14న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి గరుడోత్సవాన్ని ఈనెల 19న సాయంత్రం 6.30 గంటలకే ప్రారంభించాలని నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 14 నుంచి 23 వరకు శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార వంటి పలు సేవలను టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ప్రత్యేక దర్శనాలను కూడా నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.

18 న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి కోటా విడుదల

2024 జనవరి నెల ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా విడుదలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు అని తెలిపింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాలి అని టీటీడీ సూచించింది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్‌ సేవా టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను 23న ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను 24వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. డిసెంబరు నెలకు సంబంధించి 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవా కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవా కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed