స్వాతంత్య్ర సమరయోధుల సమాధుల స్థలాన్ని విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి పరచాలి

by Jakkula Mamatha |
స్వాతంత్య్ర సమరయోధుల సమాధుల స్థలాన్ని విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి పరచాలి
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నర్సీపట్నంలో కవర్టు, హైటర్ల సమాధులు ఉన్న అర ఎకరం వరకు ఉన్న స్థలాన్ని అల్లూరి, గంటం, మల్లు దొరల విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి పరచాలి.జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అనుబంధ సంస్థ కోటనందూరు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ అధ్యక్షులు లక్కాకుల బాబ్జి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు 20 మంది కవర్డ్, హైటర్ల సమాధులు ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. జెసిబితో చెత్తంతా తొలగించి ఒక ట్రాక్టర్ పై తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి సేనలకు బ్రిటిష్ సేనలకు మధ్య నర్సీపట్నం- దామనపల్లి ఘాట్ రోడ్డులో జరిగిన భీకర యుద్ధంలో గిరిజన యోధులే బ్రిటీష్ సేనానులను హతమార్చడం జరిగింది.అందువల్ల సమాధులు ఉన్న స్థలాన్ని అల్లూరితోపాటు గిరిజన యోధులు గంటం, మల్లు దొరల పేరుతో విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి పరచాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే పురావస్తు శాఖకు అప్పగించబడిన సమాధులు ఉన్న స్థలాన్ని ఆక్రమణలకు గురి కాకుండా స్థలం చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని పడాల వీరభద్రరావు తెలిపారు.

ఎవరైనా వెంటనే ప్రహరీ గోడ నిర్మాణానికి పూనుకొని ముందుకు వచ్చినట్లయితే మా జాతీయ అల్లూరి సీతారామరాజు సంఘం, అనుబంధ సంస్థల కార్యకర్తలు శ్రమదానం చేేస్తారని అన్నారు. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్క్ ప్రహరీ గోడ కూలిపోయిందని, అల్లూరి, గంటం సమాధులు ఉన్న స్థూపం, ఇతర భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఒకసారి 66 లక్షలు, మరొకసారి 50 లక్షలు అభివృద్ధికి నిధులు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని వెంటనే నిధులు విడుదలచేసి పార్కును అభివృద్ధి పరచాలని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహానికి అనుమతులు ఇప్పించాలని వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రధాన రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మద్దతునిచ్చి ఆ పార్టీ అభ్యర్థి విజయానికి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కృషి చేస్తుందని వీరభద్రరావు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఉపాధ్యక్షురాలు వాడపల్లి వెంకటరమణమ్మ, కార్యదర్శులు శ్యామల వరలక్ష్మి, శివంగి నాగేశ్వరరావు, లక్కాకుల బాబ్జి, కార్యవర్గ సభ్యులు ఆడారి నాగ సత్యనారాయణ, వనం రామ చంద్రబాబు నాయుడు, కె. శివనారాయణ రాజు, గుంటు చిట్టిబాబు, ఎం.వి.వి.ప్రసాద్, కోటనందూరు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ఉపాధ్యక్షుడు దాడి లోవరాజు, కార్యదర్శి గజ్జలపు జయప్రకాష్, తోలెం సత్తిబాబు, లక్కాకుల ధనంజయ, గొంప వరహాలు, కురందాసు వరహాలు, లక్కాకుల నగేష్, అనకాపల్లి రమణ, లక్కాకుల గోవిందు, మళ్ల రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed