అధ్యక్షా అనేదెవరు?.. ఎన్నికల బరిలో నాలుగు కొత్త ముఖాలు

by GSrikanth |
అధ్యక్షా అనేదెవరు?.. ఎన్నికల బరిలో నాలుగు కొత్త ముఖాలు
X

దిశ ప్రతినిధి, కడప: రాజకీయాల్లోకి రావాలి.. ఎమ్మెల్యే కావాలి... అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అని పిలవాలి అన్న కోరికతో చాలామంది రాజకీయ అరంగేట్రం చేస్తుంటారు. ఎన్నికల్లో ఓటరు దేవుళ్ల ప్రసన్నం ఉంటేనే వారి ఆశలు, సంకల్పం నెరవేరుతుంది. రాజకీయాల్లో చాలా చోట్ల పాత కాపుల పోటీ, మరికొన్ని చోట్ల పాత వారితో కొత్తవారు ఢీకొనడం లాంటి పోరు సాగుతుంది. ఇలాంటి స్థానాలపై రాజకీయ ఆసక్తి ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు చోట్ల కొత్తగా కూటమి నుంచే మొదటిసారి అభ్యర్థులు ఉన్నారు. ఈ నలుగురిలో ఎందరి సంకల్పం నెరవేరుతుందన్నది వారి రాజకీయ భవితవ్యంపై ఆధారపడి ఉంది.

అధ్యక్షా అంటారా..

ఉమ్మడి కడప జిల్లాలో నలుగురు కొత్త అభ్యర్థులు ఎన్డీఏ కూటమి నుంచి బరిలో దిగారు. వైసీపీ సిట్టింగ్‌లకు, ఒక చోట సీనియర్ కు టికెట్ ఇవ్వగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల్లో నాలుగు చోట్ల కొత్తవారిని బరిలో దించారు . వీరిలో ఒకరు బీజేపీ, మరొకరు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుండగా మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు . వీటిలో కమలాపురం, కడప, బద్వేలు, రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కమలాపురం, కడప అసెంబ్లీలు జనరల్ స్థానాలు కాగా రైల్వే కోడూరు, బద్వేలు నియోజక వర్గాలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉన్నాయి.

జగన్ మేనమామపై చైతన్య పోటీ

జిల్లాలోని కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా మూడోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాధరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై 2014, 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహారెడ్డి పోటీ చేశారు. ఈ సారి పుత్తా తనయుడు గుత్తా చైతన్య రెడ్డి కొత్తగా బరిలో దిగారు. కమలాపురం నియోజకవర్గంలో చేతన్య రెడ్డి తండ్రి నరసింహారెడ్డి నాలుగు సార్లు పోటీ చేసారు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడిని అభ్యర్థిగా బరిలో దించడంతో ఆయనకు సానుభూతి పవనాలు కలిసి వస్తాయనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తోడు ప్రభుత్వ వ్యతిరేకత సానుకూలంగా మారుతుందన్న ధీమా వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే పుత్తా నరసింహారెడ్డి ,ఆయన తనయుడు చైతన్య రెడ్డి లు సుమారు ఏడాది నుంచి ఎన్నికలపై దృష్టి సారించారు. వారి పట్ల జనం చూపిస్తున్న ఆదరణ నేపథ్యంలో ధీమాతో ఉన్న చైతన్య రెడ్డి సంకల్పం అసెంబ్లీలో అడుగుపెట్టేలా సానుకూలంగా మారుతుందేమో చూడాలి.

ఉపముఖ్యమంత్రిపై మాధవి రెడ్డి

ఉమ్మడి జిల్లా కేంద్రమైన కడపలోను ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మూడోసారి బరిలో దిగి హ్యాట్రిక్ కొట్టాలన్న కసరత్తులో ఉన్న ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషాపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె కూడా మొదటిసారి ఎన్నికల్లో బరిలోకి దిగారు. కడపలో పోటీకి సమాయత్తమైనప్పటినుంచి అలుపెరగని పోరు సాగిస్తున్నారు. ఇన్చార్జిగా నియమించింది మొదలు నాటి నుండి నేటి వరకు జనం మధ్యలో తిరుగుతున్నారు. అంజాద్ భాషను, వైసీపీ ధీటుగా ఎదుర్కొనే నమ్మకాన్ని పార్టీతో పాటు పార్టీ శ్రేణులకు కల్పించారు. ఆమె అసెంబ్లీ ఎన్నికల కోసం చేస్తున్న కసరత్తు పార్టీని కూడా పటిష్ట పరిచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలో అనేక మందిని పార్టీలో చేర్పించుకుంటూ కష్టపడుతున్న ఆమె అదృష్టం అసెంబ్లీ తలుపులు తడుతుందేమో చూడాలి.

డాక్టర్‌తో ఇంజనీర్ పోటీ

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేలు నుంచి ఇద్దరు అభ్యర్థులు విద్యావంతులే. వీరిలో వైసీపీ అభ్యర్థి సుధా డాక్టర్ కాగా, ఆమెపై మొదటిసారిగా పోటీ చేస్తున్న రోషన్న ఇంజనీర్‌గా పనిచేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. బద్వేలు స్థానం బీజేపీకి కేటాయించడంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉండి, ఆయన కూడా ప్రచారం చేపట్టి టికెట్ పై నమ్మకంతో ఉండడం తీరా బీజేపీ నుండి పోటీ చేయాల్సి రావడం కొంత ఇబ్బందికరంగా మారినా ఆయన మొక్కవోని విశ్వాసంతో ముందు సాగుతున్నారు. ఆయనకు టీడీపీ నేతలందించే సహకారం మరికొంత ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యావంతుడుగా నియోజకవర్గంలో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అందుకు తగ్గట్టు కష్టపడుతున్నారు. మరి కూటమిలోని పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే ఆయన సంకల్పం నెరవేర్చి అసెంబ్లీకి పంపించే అవకాశాలు ఉంటాయి.

హ్యాట్రిక్ వీరుడితో సర్పంచ్ ఫైట్

మరో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన రైల్వేకోడూరు పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇప్పటికి నాలుగు సార్లు గెలుపొందిన కొరముట్ల శ్రీనివాసులతో ఈ సారి కొత్త అభ్యర్థిగా సర్పంచ్ ఫైట్‌కు దిగారు. శ్రీనివాసులు మూడుసార్లు సాధారణ ఎన్నికల్లోను, ఒకసారి ఉప ఎన్నికలోను గెలుపొంది వరుస విజయాలను కొనసాగిస్తూ డబుల్ హ్యాట్రిక్‌పై గురిపెట్టి ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. ఈయనపై జనసేన అభ్యర్థిగా ముక్కావారి పల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. ఒకప్పటి తెలుగుదేశం కంచుకోట అయిన రైల్వే కోడూరులో 2004 నుంచి ఆ పార్టీ వరుస పరాజయాల పాలవుతోంది. ఈసారి రైల్వే కోడూరు గెలిచి తీరాలన్న సంకల్పంతో ఉన్న టీడీపీకి అక్కడ టికెట్ కేటాయించలేదు. కాకపోతే టీడీపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుండి అరవ శ్రీధర్ మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సాంప్రదాయంగా టీడీపీకి బలమైన ఓట్లు ఉన్నాయి. ఇందుకు తోడు కూటమి పార్టీల నేతలు అందరూ రెట్టింపుతో కష్టపడితేనే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మరి ఆ వైపుగా అందరూ కలిసి పనిచేస్తే అరవ శ్రీధర్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇలా నలుగురు కొత్త అభ్యర్థులు అసెంబ్లీ బరిలో దిగారు. మరి వీరిలో అధ్యక్షా అనే యోగం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed