బెల్టు తీస్తే ఒట్టు.. జిల్లాలో బెల్టు దుకాణాల ఇష్టారాజ్యం

by samatah |
బెల్టు తీస్తే ఒట్టు.. జిల్లాలో బెల్టు దుకాణాల ఇష్టారాజ్యం
X

‘‘కర్నూలు ముజఫర్ నగర్ లో నాలుగు రోజుల క్రితం ఇద్దరు యువకులు గొడవపడ్డారు. ఈ క్రమంలో పక్కనే బజ్జీలు దుకాణం వద్దకు వెళ్లి పొయ్యిపై సలసల కాగుతున్న నూనెను ఆవేశంతో మరో యువకుడిపై పోశాడు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితికి చేరుకున్నాడు. మరోవైపు నేరస్తుడిగా మారిన యువకుడు జైలుకు వెళ్లడంతో నిందితుడి తండ్రి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ ఘోరం మద్యం మత్తులోనే జరగడం విశేషం.

దిశ, కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 183 మద్యం దుకాణాల్లో 732 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీటిలో కర్నూలు జిల్లాలో 95 మద్యం దుకాణాలు, 285 మంది సేల్స్ మెన్లు, 95 మంది సూపర్ వైజర్లు, నంద్యాల జిల్లాలో 88 మద్యం దుకాణాల్లో 264 మంది సేల్స్ మెన్లు, 88 మంది సూపర్ వైజర్లు పని చేస్తున్నారు. అయితే కర్నూలు నగరంలో ప్రతి సందులో బెల్టు దుకాణాలు వెలిశాయి. నగరంలో పోలీసులు, దళారులు కుమ్మక్కై తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన పంచలింగాల, కర్నూలు, బ్రాహ్మణకొట్కూరు, ఆలూరు, సున్నిపెంట, సిద్దేశ్వరం, కొత్తపల్లి, ఎర్రమఠం, మాడుగుల, కొక్కెరంచ, ముసలిమడుగు, ఆత్మకూరు, క్రిష్ణాపురం, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన ఆదోని, ఆలూరు, మంత్రాలయం, చిప్పగిరి, కౌతాలం, తుగ్గలిని మద్యం తెప్పించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై గొడవకు దిగడం, లేకుంటే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.

నామమాత్రపు దాడులు

కర్నూలు నగరంలో యథేచ్ఛగా బెల్టు దుకాణాల నుంచి తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్నారు. దీంతో ఆయా కాలనీకి చెందిన మహిళలు, పెద్దలు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే మామూళ్లు తీసుకున్న పోలీసులు చుట్టపు చూపుగా వచ్చి నామ మాత్రపు తనిఖీలతో సరిపెట్టుకుంటున్నారు. పోలీసులు వెళ్లగానే బెల్టు దుకాణదారులు మళ్లీ వారి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో స్థానికులు బెల్ట్ షాప్ ల నిర్వాహకులను నిలదీశారు. అందుకు నిర్వాహకులు తెలంగాణ, ఏపీ పోలీసులకు తాము లంచాలు ఇస్తున్నామని, అందుకే తమను ఎవరూ ఏమి చేయలేరని బహిరంగంగా బెదిరించడం కొసమెరుపు.

టార్గెట్ల కోసమేనా ?

రాష్ర్ట ప్రభుత్వం తీరుతో ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. ఆదాయాన్ని పెంచాలనే టార్గెట్లు ఇవ్వడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది మద్యం విక్రయాలు సాగిస్తే రోజుకు రూ.3 నుంచి రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. అయితే ప్రతి రోజూ ఆదాయం పెంచాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఫోన్లు రావడంతో క్షేత్ర స్థాయిలో సిబ్బంది హడలిపోతున్నారు. ఈ కారణంగానే బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed