టీడీపీ-జనసేన పొత్తు: ఈనెల 23న పవన్-లోకేశ్‌ల కీలక భేటీ

by Seetharam |   ( Updated:2023-10-20 12:51:19.0  )
టీడీపీ-జనసేన పొత్తు: ఈనెల 23న పవన్-లోకేశ్‌ల కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సాక్షిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తును ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో కలిసే 2024 ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని అటు పవన్ కల్యాణ్.. ఇటు నారా లోకేశ్ సైతం ప్రకటించారు. ఎలా అయితే పవన్ కల్యాణ్ పొత్తు విషయంలో ముందు ప్రకటన చేశారో అలాగే టీడీపీతో సమన్వయం కోసం జనసేన పార్టీ తరఫున సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. అనంతరం టీడీపీ సైతం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అటు జనసేన తరఫున ఐదుగురు సభ్యులు, ఇటు టీడీపీ నుంచి ఐదుగురు సభ్యులతో కో ఆర్డినేషన కమిటీని ఇరు పార్టీలు నియమించాయి. పొత్తుల ప్రకటన అయితే జరిగిపోయింది కానీ భవిష్యత్ కార్యచరణపై ఇరు పార్టీల అగ్రనేతలు ఎలాంటి కసరత్తు చేపట్టడం లేదు. ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు కలిసి పలు పోరాటాలు చేస్తున్నప్పటికీ అగ్రనాయకత్వం మాత్రం ఎలాంటి ఉమ్మడి కార్యచరణ ప్రకటించలేదు. దీంతో అటు టీడీపీ ఇటు జనసేనలో టెన్షన్ నెలకొంది. ఒకవైపు వైసీపీ ఉప్పెనలా ప్రజల్లోకి దూసుకెళ్లిపోతుంటే... ఉమ్మడి కార్యచరణ ప్రకటించకుండా తాత్సారం చేయడంపై అటు నేతలు ఇటు కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇరు పార్టీలు భేటీ కావాలని నిర్ణయించాయి. ఈనెల 23న రాజమహేంద్రవరం వేదికగా భేటీ కావాలని నిర్ణయించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు భేటీ కానున్నారు. అదేరోజు ఇరు పార్టీలకు సంబంధించి సంయుక్త కార్యచరణ కమిటీ భేటీ కానుంది. ఉమ్మడి పోరాటం, పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే ఇరు పార్టీలు సంయుక్త కార్యచరణ కమిటీ సభ్యులనులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు అదే రోజు భేటీ కానుంది. రాజకీయ కార్యక్రమాలు మరింత వేగవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిటీకి అధినేతలు దిశానిర్దేశం చేయనున్నారు.

తొలి భేటీ

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు అయితే పొడిచింది కానీ ఉమ్మడి కార్యచరణ విషయంలో ముందడుగు పడటం లేదు. అంతే కాదు ఇరు పార్టీలకు సంబంధించి కో ఆర్డినేషన్ కోసం సభ్యుల నియమితులు అయినప్పటికీ ఉమ్మడిగా భేటీ అయిన దాఖలాలు సైతం కనిపించడం లేదు. ఉమ్మడి కార్యచరణ, టికెట్ల సర్ధుబాటు, వైసీపీపై వ్యతిరేకంగాపోరాటం చేయాల్సిన అంశాలపై విధివిధానాలు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి తదితర అంశాలపై ఇరు పార్టీల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.ఈ నేపథ్యంలో అసలు పొత్తు ఉంటుందా అనే అనుమానం సైతం కలుగుతుంది. మరోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ నై అంటున్న నేపథ్యంలో పవన్ సైతం చేతులెత్తేశారా ఏంటి అనే ప్రచారం సైతం జరిగింది. ఇలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ, జనసేనలు సిద్ధమయ్యాయి. తమ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందనేందుకు సరికొత్త సంకేతాలు ఇవ్వనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 23న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లు భేటీ కానున్నారు. ఇరువురు నేతలు రాజమహేంద్రవరంలో ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ నిర్వహించే విషయమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి కార్యాచరణతో పాటు క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అదే రోజు ఇరు పార్టీలకు సంబంధించిన సంయుక్త కార్యచరణ కమిటీ సైతం తొలి భేటీ జరగనుంది.

ఉమ్మడి కార్యచరణపై చర్చ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పవన్ కల్యాణ్‌తోపాటు తొలి కమిటీ వచ్చే సోమవారం భేటీ కానుంది. ఇరువురు నేతలు సీట్ల పంపకాల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీ నేతలు ఆత్మస్థైర్యం కోల్పోయారు. వారిలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా.. ఉమ్మడి భవిష్యత్ కార్యచరణపై ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పోటీ చేసే స్ధానాలు, జనసేనకు కేటాయించే స్ధానాలపై లోకేశ్-పవన్ కల్యాణ్‌ల మధ్య చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీపై భేటీకి సంబంధించి ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే ఉమ్మడి కార్యచరణను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

2014 కాంబినేషన్ రిపీట్?

ఇకపోతే 2014 ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్లాయి. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దించలేదు. ఓట్లు చీల్చకూడదనే ఏకైక లక్ష్యంతో పవన్ కల్యాణ్ అభ్యర్థులను బరిలోకి దించలేదు. అంతేకాదు టీడీపీ,బీజేపీ అభ్యర్థుల గెలుపునకు సంబంధించి ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. అదే కాంబినేషన్‌ను వచ్చే ఎన్నికల్లో రిపీట్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం నై అంటుంది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లే అంశంపై తర్జనభర్జన పడుతుంది. అయితే బీజేపీని ఒప్పించే భారం పవన్ కల్యాణ్ తన భుజస్కందాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి వచ్చే ఎన్నికల్లో రాకూడదంటే కలిసి పోటీ చేయాల్సిందేనని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : Pawan Kalyan : సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed