ఎన్టీఆర్ మావాడే..కాదు మావాడే : పోటీ పడుతున్నటీడీపీ, పురంధేశ్వరి

by Seetharam |   ( Updated:2023-07-24 06:29:57.0  )
ఎన్టీఆర్ మావాడే..కాదు మావాడే : పోటీ పడుతున్నటీడీపీ, పురంధేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అని దేశంలో చాలా మందికి తెలుసు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ మరణం అనంతరం టీడీపీ అధినేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నడుస్తున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కాదని చంద్రబాబు లాక్కున్న దొంగ టీడీపీ అని అధికార పార్టీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నుంచి టీడీపీని లాక్కున్న తర్వాతనే అది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అవుతుందంటున్నారు. ఇలా ఎన్టీఆర్ టీడీపీ, చంద్రబాబు దోచుకున్న టీడీపీ అంటూ చేస్తున్న విమర్శలు టీడీపీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టారు. నందమూరి తారకరామారావు ముద్దుగా పిలుచుకునే చిన్నమ్మ పురంధేశ్వరి. పురంధేశ్వరి సైతం ఎన్టీఆర్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అటు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ జై ఎన్టీఆర్ అంటుంటే ఇటు పురంధేశ్వరి నేతృత్వంలోని బీజేపీ సైతం ఎన్టీఆర్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.

ఎన్టీఆర్ మావాడేనంటున్న టీడీపీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పదేపదే ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. చంద్రబాబుపై అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేయడంతోపాటు...చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏదో చూపించాలని సవాళ్లు విసురుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన ఒక్క పథకాన్ని అయినా చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటు అడగాలని వైసీపీ నిలదీస్తోంది. అయితే ఈ అంశంపై టీడీపీ సరైన కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతుంది. ఇదే తరుణంలో అన్న ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకువస్తోంది. నందమూరి తారకరామారావు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తుంది. మహిళలకు రిజర్వేషన్లు, బీసీలకు అగ్రతాంబూలం, రూ.2కే కిలో బియ్యం ఇలా ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను మళ్లీ ఇప్పుడు టీడీపీ గుర్తు చేస్తోంది. ఇలా టీడీపీ ఎన్టీఆర్ మరోసారి జపం చేస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా చేస్తోంది. ఇలా ఎన్టీఆర్ తమవాడు అని చెప్పుకుంటూనే...మరోవైపు ఎన్టీఆర్ చేసిన అభివృద్ధిని చేసి చూపిస్తామంటూ టీడీపీ ముందుకు వెళ్తోంది.

ఎన్టీఆర్‌ను గుర్తు చేస్తున్న పురంధేశ్వరి

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం రాజకీయాల్లో దూకుడు పెంచారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని..తానేంటో తన నాయకత్వం ఏంటో అటు బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియజేసేందుకు పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని బలోపేతం చేసే పనిలో భాగంగా దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్ఆర్ కడప ప్రొద్దుటూరులో రాయలసీమ జోన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన తండ్రి ఎన్టీఆర్‌ను మైమరపించేలా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడా ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచే ప్రారంభించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన రాష్ట్ర పర్యటన కూడా సీమ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.

ఎవరి ప్రయత్నాలు వారివి

ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఎన్టీఆర్ జపం ఎక్కువ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ పేరును నిత్యం జపిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించడంతోపాటు అవార్డులు సైతం ఇస్తూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తరుణంలో తాను ఎన్టీఆర్ కుమార్తెను అని దగ్గుబాటి పురంధేశ్వరి సైతం తెరపైకి వస్తుంది. ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నట్లు ప్రకటించింది. ఇలా అటు టీడీపీ ఇటు దగ్గుబాటి పురంధేశ్వరిలు ఎవరి ప్రయత్నాలు వారు ఎన్టీఆర్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ఓన్ చేసుకుందంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి. మరి పురంధేశ్వరి సైతం తన తండ్రిగా చెప్తూ ఆయన ఓన్ చేసుకునేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ వ్యహారంలో ఎవరు పై చేయి సాధిస్తారనేది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed