- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఎటువైపు.. బీజేపీ చెలిమితో ఏపీలో గట్టెక్కాలనుకుంటున్నారా?
జాతీయ రాజకీయాల్లో మీకెంతో అనుభవముంది. ప్రస్తుతం దేశానికి మీ సేవలు అవసరం. మీరు ముందు నిలవండి. మీ అడుగులో అడుగేస్తామంటూ ఇటీవల కాంగ్రెస్‌నేత కేవీపీ రామచంద్రరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. మరోవైపు బీజేపీ చెలిమి కోసం చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. జాతీయ సర్వేల్లో ఈసారి ఎన్డీయేకి 130 సీట్లు మించవనే అంచనాలున్నాయి. ఇలాంటి తరుణంలో ఎటువైపు మొగ్గుచూపుతారనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేంద్ర సర్కారు పెద్దలు ఇప్పటికే సీఎం జగన్‌కు తోడూనీడగా ఉన్నారు. చంద్రబాబుతో జట్టు కడతారా? అనేది ఇప్పట్లో తేల్చరు. బీజేపీ నేత సత్యకుమార్‌పై వైసీపీ కార్యకర్తల దాడితో తాము వైసీపీ వైపు లేమనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం ప్రథమ కర్తవ్యం. ఓడితే పార్టీ పునాదులు కదిలిపోయే ప్రమాదం నెలకొంది. అందువల్ల జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం కన్నా రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవడంపైనే ఆయన కేంద్రీకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాష్ట్రాన్ని వదిలి జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేరు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ వైఖరి ఎలా ఉండాలనే దానిపై చంద్రబాబు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోవచ్చు. కేంద్రంలో ఈసారి బీజేపీ వస్తుందా? లేక కాంగ్రెస్, విపక్షాలు అధికారాన్ని చేపడతాయా? అనే అంచనాల్లో కొంత స్పష్టత వచ్చేదాకా చంద్రబాబువేచి చూసే ధోరణి అవలంభించ వచ్చంటూ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
బీజేపీకి జగన్‌ను దూరం చేసేలా పావులు
మరోవైపు సీఎం జగన్‌కు కేంద్రంలోని బీజేపీ పెద్దల సహకారం లేకుండా చేయాలని పావులు కదుపుతున్నారు. అండమాన్దీవుల ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేసినట్లు సమాచారం. అక్కడ పార్టీ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనడం విశేషం. మరోవైపు సుజనా చౌదరిలాంటి వాళ్లు టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ పెద్దలు కూడా ఇటు సీఎం జగన్‌కు తోడ్పాటును అందిస్తూనే టీడీపీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలిస్తోంది. నిన్నమొన్న బీజేపీ నాయకుడు సత్యకుమార్‌పై వైసీపీ కార్యకర్తల దాడిని అందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా తాము వైసీపీకి దూరమన్నట్లు చెప్పేందుకే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా..
కేంద్రంలో ఈ దఫా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు వాళ్లతో కలిసి పనిచేసే ఆలోచనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటిదాకా జాతీయ రాజకీయాలపై మౌనం వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెనుభారాలు మోపుతున్నా స్పందించడం లేదు. చివరకు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసినా చంద్రబాబు మారుమాట్లాడలేదు. పెట్రోలు, డీజిల్‌తోపాటు నిత్యావసరాల ధరలపై భారీగా పన్నుల్లేస్తున్నా కిమ్మనలేదు. విశాఖ స్టీల్‌ప్లాంటును అమ్మేస్తామన్నా.. పోలవరాన్ని ఇప్పట్లో పూర్తి చేయలేమని చెప్పినా కేంద్రాన్ని పల్లెత్తు మాటనలేదు. అదానీలాంటి క్రోనీ క్యాపిటలిస్టు దోపిడీకి రాష్ట్రాన్ని కేంద్రంగా మలుస్తున్నా చంద్రబాబు మౌనం వహించారు.
పార్టీ విస్తరణలో బిజీబిజీ
ఇంకోవైపు జనసేన టీడీపీతో కలవకుండా బీజేపీ వ్యవహరిస్తోంది. ఈ దఫా టీడీపీ ఓడిపోతే 2029 ఎన్నికల్లో పవన్సీఎం అవుతారంటూ ఊరిస్తోంది. సీఎం జగన్‌కూడా జనసేన టీడీపీ వైపు వెళ్లకుండా కేంద్ర పెద్దల వద్ద పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ అటు అధికార పార్టీ, ఇటు జనసేనలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చిన బూస్ట్‌తో ప్రజల్లో పార్టీ పునాదిని మరింత విస్తరించే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడిప్పుడే చంద్రబాబు జాతీయ స్థాయిలో తమ పార్టీ వైఖరేంటనే దాని జోలికి వెళ్లకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎత్తుగడ ఏమేరకు ఫలితాలిస్తుందనే దానిపై పార్టీ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.