ఎన్నికల వేళ ఏపీ సాధు పరిషత్ సంచలన పిలుపు

by srinivas |   ( Updated:2024-05-11 06:23:18.0  )
ఎన్నికల వేళ ఏపీ సాధు పరిషత్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అన్ని పార్టీలు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. మరికాసేపట్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఎక్కడి మైకులు అక్కడే మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సాధు పరిషత్ సంచలన పిలుపునిచ్చింది. రాష్ట్రంలో బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. కూటమి అభ్యర్థులకే ఓటు వేయాలని ప్రజలను కోరింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లుగా రాష్ట్రం అట్టుడికిపోయిందని, అర్చకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారని గుర్తు చేశారు. హిందూ ధర్మాన్ని తుడిచిపెట్టేయాలనే ఆలోచన చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారని ధ్వజమెత్తారు. ఆచారాలు, సంప్రదాయాలను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో దాడులు జరిగితే ఇంతవరకూ నిందితులకు శిక్ష పడలేదని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని, వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో వైసీపీ దుర్మార్గంగా వ్యవహరించిందని, ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed