- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజమా.. నైజమా..! షర్మిల ప్రశ్నలకు బదులివ్వలేక వైసీపీ ఎదురుదాడి
అధికార వైసీపీ దృష్టి మొత్తం షర్మిలపైనే ఉంది. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై షర్మిల ప్రభుత్వంపై నేరుగా బాణాలు ఎక్కు పెడుతున్నారు. వైసీపీ, టీడీపీలు.. బీజేపీకి బానిసలుగా మారాయని దుమ్మెత్తి పోస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ లేరని తేల్చి చెబుతున్నారు. వైఎస్‌కు అసలు సిసలైన వారసురాలిని తానేనని ప్రకటించుకున్నారు. దీంతో టీడీపీ కన్నా షర్మిల వల్లే పెద్ద ఎత్తున డ్యామేజీ జరుగుతుందని వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయి. సోషల్ మీడియాతో సహా వైసీపీ యంత్రాంగమంతా షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ మరింత బలపడేందుకు దోహదపడుతున్నారు. దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దిశ, ఏపీ బ్యూరో: గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం వెనుక వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆమె 3,200 కి.మీ పాదయాత్ర చేశారు. పార్టీని సజీవంగా ప్రజల్లో నిలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ కుటుంబంలో చిచ్చు రాజుకుంది. పదవులు, ఆస్తులు లేదా ఇంకా మరే కారణాలైనా కావొచ్చు. సీఎం జగన్‌కు తల్లీ, చెల్లీ దూరమయ్యారు. తెలంగాణకే పరిమితమయ్యారు. తర్వాత అనూహ్య పరిణామాలతో షర్మిల తిరిగి రాష్ట్రంలో అడుగు పెట్టారు. పీసీసీ అధ్యక్ష స్థానంలో నిలబడ్డారు. అధికార, ప్రతిపక్షాలు కేంద్రంలోని బీజేపీకి అంటకాగుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
జవాబివ్వలేక.. ట్రోలింగ్
షర్మిల లేవనెత్తిన ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలపై అధికార ప్రతిపక్షాల వద్ద సమాధానం లేదు. ఓవైపు తాను వైఎస్ వారసురాలిని అని చెబుతూనే కాంగ్రెస్‌నేతగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. వీటికి సమాధానం చెప్పలేక అధికార పార్టీ శ్రేణులు ఆమెపై బురదజల్లుడు ప్రారంభించారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిలను సీఎం చేయాలని సోనియాగాంధీని అనిల్ అడిగినట్లు తెర మీదకు తెస్తున్నారు. నాడు వైఎస్ భారతి పాదయాత్ర చేయాల్సి ఉంటే ఆమెను వెనక్కి నెట్టేసి షర్మిల పాదయాత్ర చేసినట్లు నమ్మబలుకుతున్నారు. ఇంకా అనిల్ వ్యాపారాల వల్లే జగన్ షర్మిలను దూరంగా పెట్టినట్లు సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.
జగన్ ఫ్యామిలీలో కాంగ్రెస్ చిచ్చు పెట్టిందట..
కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబంలో చిచ్చు పెడుతోందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గతంలో వివేకానందరెడ్డి, ఇప్పుడు షర్మిలతో తనపై కక్ష తీర్చుకుంటోందని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ రాజకీయ వర్గాల్లో భిన్నమైన వాదనలకు తావిస్తున్నాయి. వైసీపీలోని అసంతృప్తి నేతలు టీడీపీ – జనసేన కూటమి వైపు వెళ్లకూడదనే ఎత్తుగడ అయి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత గంపగుత్తగా ప్రతిపక్ష కూటమికి మరలకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ను తెరపైకి తెస్తున్నట్లు మరికొందరు పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ ఎత్తుగడలు ఏమైనా సరే షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే భావన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.