Anagani: ప్రైవేటు భూములు 22ఏలో ఉండ‌కూడ‌దు

by Anil Sikha |
Anagani: ప్రైవేటు భూములు 22ఏలో ఉండ‌కూడ‌దు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేటు భూములేవీ కూడా 22ఏలో ఉండ‌కూడ‌ద‌న్నదే ప్రభుత్వ ఆశ‌య‌మ‌ని, ఆ దిశ‌గా క‌లెక్టర్లు ప‌నిచేయాల‌ని రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. స‌చివాల‌యంలో ఇవాళ క‌లెక్టర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్రజ‌ల‌కు భూమి అనేది సెంటిమెంటుతో కూడుకున్న వ్యవ‌హార‌మ‌న్నారు. భూ వివాదాల ప‌రిష్కారానికి క‌లెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని కోరారు. ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే రెవెన్యూ శాఖ‌లో ప‌లు సంస్కర‌ణ‌లు చేప‌ట్టామ‌న్నారు. గ‌త ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు, ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క చ‌ట్టాన్ని, ఆర్ ఓ ఆర్ చ‌ట్టాల‌ను తీసుకొచ్చామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో అన్ అబ్జెక్షన‌బుల్ ల్యాండ్స్ ఉన్న పేద‌ల‌కు ఆ భూమిని క్రమ‌బ‌ద్దీక‌రించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేప‌డుతోంద‌ని మంత్రి అనగాని తెలిపారు. 22ఏ భూముల వివాదాల ప‌రిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఫ్రీ హోల్డ్ భూములపై వివాదాలు లేకుండా చూసుకోవాల‌న్నారు. వివాదాలుంటే పెట్టుబ‌డుల‌పై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాద‌ం ఉందని హెచ్చరించారు. దీనికోసం జిల్లాల్లో ప్రత్యేకించి రియ‌ల్ ఎస్టేట్ క‌మిటీ ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. జిల్లా, రెవెన్యూ, మున్సిపాల్టీ, పంచాయ‌తీ, ప‌ట్టణాభివృద్ధి సంస్థలు, బ్యాంక‌ర్లు అంద‌రూ ఈ కమిటీలో స‌భ్యులుగా ఉండేలా చూడాల‌న్నారు. ఈ క‌మిటీ ప్రతి నెల లేదా రెండు నెల‌ల‌కు ఒక‌సారి స‌మావేశ‌మై భూ వివాదాలు ప‌రిష్కరించాల‌ని మంత్రి అనగాని కోరారు

Advertisement
Next Story

Most Viewed