జనసేన అభ్యర్థుల ఖరారు: ప్రకటించనున్న పవన్ కల్యాణ్.. ఆ నియోజకవర్గాలపై ఉత్కంఠ

by Seetharam |   ( Updated:2023-11-03 07:20:48.0  )
Pawan Kalyan: మైండ్ గేమ్ పాలిటిక్స్‌పై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఏదో ఒకటి తేల్చుకోనున్నారా? ఇప్పటికే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలి అని నిర్ణయించుకున్న పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపై మీనమీషాలు లెక్కించడం వెనుక ఉద్దేశం ఏమిటి? తెలంగాణలోనూ పోటీ చేస్తాం అని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? అనుకున్నట్లు 32 స్థానాల్లో పోటీ చేస్తారా లేక 12 సీట్లకే పరిమితం అవుతారా? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ ప్రశ్నలకు చిక్కుముడి విప్పాలంటే పవన్ కల్యాణ్‌తోనే సాధ్యమని అందరికీ తెలిసిందే. బీజేపీతో పొత్తులేకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేద్దామనుకుంటున్నట్లు గతంలోనే పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌లు పొత్తుకోసం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని స్నేహహస్తం అందించారు. దీంతో వారి ప్రతిపాదనను స్వాగతించడంతో కేంద్ర హోంశాఖ మంత్రితో సైతం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అయితే టికెట్ల సర్ధుబాటుపై ఇరువురు ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల జాబితాను వరుసగా విడుదల చేస్తోంది. కానీ జనసేన స్థానాలపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. దీంతో జనసైనికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు శుక్రవారం లేదా శనివారాల్లో పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెడతారని తెలుస్తోంది.

నేడో రేపో అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరో అంకానికి చేరాయి. నామినేషన్ల ప్రక్రియకు తెరలేపడంతో ఎన్నికల వేడి మరింత హీటెక్కింది. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో వారంతా ప్రచారంలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. మరికొందరు టికెట్లు ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మూడు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించింది. మరోజాబితా విడుదల చేయాల్సి ఉంది. ఈ జాబితా విడుదలపై ఇప్పటికే బీజేపీ నాయకత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. అయితే జనసేనతో పొత్తు నేపథ్యంలో టికెట్ల సర్ధుబాటు జరగాల్సి ఉంది. ఇంతలో మెగా కుటుంబంలో పెళ్లి వేడుక ఉన్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇటలీ వెళ్లారు. దీంతో టికెట్ల సర్ధుబాటు అంశంపై కాస్త బ్రేక్ పడింది. అయితే శుక్రవారం పవన్ కల్యాణ్ ఇటలీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నేడు తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నిస్థానాల్లో పోటీ చేయబోతుందో అనేది పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో కలిసి ప్రకటిస్తారని తెలుస్తోంది.

బీజేపీకా?జనసేనకా?

తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే టికెట్ల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. టికెట్ల సర్ధుబాటు, కేటాయింపులపై ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నేడో రేపో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇకపోతే జనసేన పార్టీ కూకట్ పల్లి, శేర్‌లింగంపల్లి సీట్లను ఆశిస్తుంది. అయితే ఆ స్థానాలు జనసేనకు కేటాయిస్తే బీజేపీకి మూకుమ్మడి గా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరే ఆలోచణలో బీజేపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీలకమైన నియోజకవర్గాలపై అటు బీజేపీ, ఇటు జనసేనలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. తొలుత పవన్ కల్యాణ్ 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా 12 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ 11 స్థానాలు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే జనసేన 12 స్థానాలు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 12 స్థానాల్లు జనసేన ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed