ఏపీలో ఎన్ఐఏ సోదాలు కలకలం

by Seetharam |   ( Updated:2023-10-02 05:38:57.0  )
ఏపీలో ఎన్ఐఏ సోదాలు కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. సోమవారం తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతం నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలువురు పౌరహక్కుల నేతలు, న్యాయవాదుల నివాసాల్లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆకస్మిక సోదాలు కలకలం రేపాయి. మంగళగిరి-తాడేపల్లి నగర కార్పొరేషన్ పరిధిలోని నవులూరు మక్కేవారి పేటలో సిప్పోరా ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే తాడేపల్లి మహానాడు 13 వ రోడ్డు బత్తుల రమణయ్య నివాసంలోను ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. వీరిద్దరితోపాటు తాడేపల్లి డోలాస్ నగర్‌లో ఎన్ క్రాంతి కుమార్ నివాసం లోను ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. చైతన్య మహిళా సంఘం సభ్యురాలు సిప్పోరా కి హైదరాబాద్ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ఐఏ పేరిట సెప్టెంబర్ 13 నోటీసు జారీ అయ్యాయి. సీఆర్పీసీ 160 సెక్షన్ క్రింద సిప్పోరాకి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున 5గంటలు నుండి ఎన్ఐఏ నిర్బంధ సోదాలు నిర్వహిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా సోదాలు

గుంటూరు జిల్లా కొండపాటూరులో తమలపాకుల సుబ్బారావు, టి రాజారావు ఇంట్లో ఎన్‌ఐఏ బృందం సోదాలు జరుపుతుంది. రాజారావుకు చెందిన ప్రజా వైద్యశాలకు తెల్లవారుజామున చేరుకున్న ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య నివాసంలో సోదాలు చేపట్టారు. అదే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కావలి బాలయ్య ఇంటిలోనూ సోదాలు జరుగుతున్నాయి. గతంలో బాంబు పేలుళ్ల కేసులో బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్‌ నిందితులుగా ఉన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూల పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు నివాసంలో కూడా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్‌పేటలోని ఏపీసీఎల్‌సీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.వెంకటేశ్వర్లు రెండు దశాబ్ధాలుగా పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు, సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమహేంద్రవరంలోని బొమ్మేరులో పౌర హక్కుల నేత నాజర్‌, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ ఉద్యోగి కోనాల లాజర్‌, శ్రీకాకుళంలో మిస్కా కృష్ణయ్య ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మిస్కా కృష్ణయ్య ఆమదాలవలస మండలం తోటవాడ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురంలో మరో టీచర్ శ్రీరాములు ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే పల్నాడు జిల్లాలో పలుచోట్ల ఎన్ ఐ ఏ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నరసరావుపేటలో పిడీఎం జిల్లా కార్యదర్శి గుర్రపుసాల రామకృష్ణ, నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో పిడీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లపాటి రామారావు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.

Advertisement

Next Story