- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థి సినీ నటుడు అలీ..!

దిశ, కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని నంద్యాల పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించే విషయంలో మరింత ఆలస్యం చేస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఆరు దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది. అందులో 70 అసెంబ్లీ స్థానాలు, 18 ఎంపీ స్థానాలు ప్రకటించింది. ఇంకా 105 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలు న్నాయి. అయితే అధిష్టానం జనవరి 11న మూడో జాబితాలో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని మంత్రి కొంత కాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. సీటు విషయంపై అధిష్టానం ఎంత ప్రయత్నించినా మంత్రి అందుబాటులోకి రాకపోవడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ బీవై రామయ్యకు కేటాయించింది.
ఎంపీ స్థానంపై వీడని ఉత్కంఠ
ఇక మిగిలిన నంద్యాల పార్లమెంట్ స్థానంపై ఉత్కంఠ వీడడం లేదు. అభ్యర్థి ప్రకటన విషయంలో వైసీపీ అధిష్టానం ఆలస్యం చేస్తోంది. సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈసారి కూడా తనకే టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. అధిష్టానం మాత్రం ఆయన పట్ల సానుకూలంగా స్పందించ లేదు. ఎంపీకి పలు సర్వేలు అనుకూలంగా తేల్చలేదు. ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు చెప్పుకోదగ్గ ప్రజా కార్యక్రమాలు చేయలేదు. అలాగే తన పార్లమెంట్ పరిధిలో కనీసం సొంతంగా బలమైన క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం ఈయనకు మైనస్ గా మారింది.
ఆలీకే అనుకూలం
ఎంపీ రేసులో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, సినీ నటుడు అలీ, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అధిష్టానం సినీ నటుడు అలీ కి గాని, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ భాషలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆలీ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే వీరు ఒప్పుకోకుంటే మాత్రం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేరు సూచించినట్లు చర్చలు జోరందుకున్నాయి. వీరిని కాదని కొత్తవారికే సీటు కేటాయించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకించి వైసీపీ అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని, ఆయనకు నంద్యాల పార్లమెంట్ టికెట్ ఇవ్వనుందనే ఉద్దేశంతో ఆయన చేరిక కోసం వైసీపీ అభ్యర్థి పేరును ఖరారు చేయలేకపోతుందని విశ్వసనీయ సమాచారం.