జనసేన పార్టీ ఎమ్మెల్యే వీరాభిమానం.. జగన్ దంపతుల ఫొటోతో వెడ్డింగ్ ఇన్విటేషన్

by sudharani |
జనసేన పార్టీ ఎమ్మెల్యే వీరాభిమానం.. జగన్ దంపతుల ఫొటోతో వెడ్డింగ్ ఇన్విటేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కొన్నాళ్లకు రాపాక వరప్రసాదరావు వైసీపీకి సానుభూతిపరుడుగా మారిపోయారు. అవకాశం దొరికినప్పుడల్లా అటు అసెంబ్లీలోనూ ఇటు బయట వైఎస్ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఛాన్స్ దొరికినప్పుడల్లా సీఎం జగన్‌పై విధేయత, స్వామి భక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే, తాజాగా మరోసారి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సీఎం జగన్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.

తన కుమారుడి పెళ్లి పత్రికపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌, భారతి దంపతుల ఫోటోను ముద్రించారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నాగరత్నం దంపతుల కొడుకు వివాహం జూన్ 7న రాత్రి 1.02 గంటలకు జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రికపై సీఎం జగన్ దంపతుల ఫొటోను ముద్రించారు. తమకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు.. ఏపీ సీఎం వైఎస్ జగన్, భారతమ్మ ఆశీస్సులతో అంటూ ముద్రించారు. ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు వైసీపీ అభిమానులు ఈ శుభలేఖపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన కార్యకర్తలు, అభిమానులు మాత్రం శుభలేఖను ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మించి భజన చేస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story