ఆ మూడు పార్టీలు ఒక్కటైనా జగనే మళ్లీ సీఎం: మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-02-07 11:42:16.0  )
ఆ మూడు పార్టీలు ఒక్కటైనా జగనే మళ్లీ సీఎం: మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల తేదీ సమీపిస్తోన్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా జతకట్టిన టీడీపీ, జనసేన.. తాజాగా మరో అడుగు ముందుకేశాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కూడా తమ కూటమిలో కలుపుకోని ముందుకెళ్లేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే జనసేన ఎన్డీఏ కూటమిలో భాగం కాగా.. తాజాగా చంద్రబాబు సైతం బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో పొత్తులపై చర్చించేందుకు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొత్తులపై ఆయన చర్చించున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నా 2014 ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ లేదని జోస్యం చెప్పారు.

2014లో రాష్ట్ర విభజన జరగడంతో పాలనలో అనుభవం ఉన్న నాయకుడని చంద్రబాబును ప్రజలు గెలిపించారని అన్నారు. ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ చరిష్మాతో అప్పడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్రంలో పవర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బలం లేదని.. చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే ఇంకా ఎక్కువ మైనసని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్ని పార్టీలు కలిసిన వైసీపీకి నష్టమేమి లేదని.. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను మంచి చేసే నాయకుడిగా నమ్ముతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు ఒక్కటైనా తమ అధినేత జగనే మళ్లీ ఏపీ సీఎం అవుతారని రోజా దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story