జూరాలకు కృష్ణమ్మ పరుగులు..భారీ వరదలతో తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు

by Jakkula Mamatha |
జూరాలకు కృష్ణమ్మ పరుగులు..భారీ వరదలతో తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు
X

దిశ ప్రతినిధి,కర్నూలు:పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వివిధ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే వరద ఉధృతి కారణంగా ఆల్మట్టి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ప్రవాహం కొనసాగడం, మరో ఐదు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో నారాయణపూర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే నాలుగైదు రోజుల్లో వరద జలాలు శ్రీశైలం జలాశయానికి రానున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

నిండు కుండలా ఆల్మట్టి..

నిన్నటి రోజు వరకు ఆల్మట్టికి 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు కర్ణాటక రాష్ర్టంలోని ఆల్మట్టి డ్యామ్‌కు వచ్చి చేరింది. దీంతో 14 గేట్ల ద్వారా ద్వారా 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 100 టీఎంసీలతో నిండు కుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా గేట్లు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. గత ఏడాది జూలై 27న గేట్లు ఎత్తగా ఈ సారి 11 రోజులు ముందుగానే గేట్లు ఎత్తారు. ఎగువ ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యామ్ కు 22,621 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ డ్యామ్ లో నీరు గరిష్ట స్థాయికి చేరనుంది.

జూరాల నుంచి స్వల్ప వరద..

మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగానే కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి భీమా కాల్వ, బీమా-2 కాల్వలకు 2421 క్యూసెక్కుల నీటిని వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి స్పల్ప వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల జలాశయం నుంచి 7,500 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 808.40 అడుగులు ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.3895 టీఎంసీలుగా ఉంది. నాలుగైదు రోజుల్లో శ్రీశైలానికి వరద జలాలు వచ్చే అవకాశం ఉండటంతో అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాలైన కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. 22,089 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం అధికారులు దిగువకు వదులుతున్నారు.

అమలు కానీ బచావత్ ట్రిబ్యునల్..

శ్రీశైలం ప్రాజెక్టులో బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు కావడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులో ప్రతి ఏడాది కనీసం 53 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూడాలని నిర్ణయించింది. కానీ రాష్ర్ట విభజన సమయం నాటి నుంచి నేటి వరకు ఏనాడు ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టాన్ని మెయింటేన్ చేసిన దాఖలాల్లేవు. ప్రతి ఏటా వాటర్ ఇయర్ ప్రారంభమైన నాటి నుంచి రైతులకు టెన్షన్ తప్పడం లేదు. ప్రాజెక్టు దిగువన ఉన్న పంటలకు సాగునీరు అందుతుందా ? లేదా ? అని ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం జలాశయంలో క్యారీ ఓవర్ చేసేందుకు వీలుగా కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చూడాలి. కానీ అలా చేయడం లేదు. ప్రతి ఏడాది రుతుపవనాలు ఆలస్యమైనా, తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిన కనీస అవసరాలు తీర్చేందుకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరే వరకు నీటిని తోడి పోస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో 31.97 టీఎంసీలకు చేరుకుని ప్రమాద ఘంటికలు మోగాయి. ప్రతి ఏడాది ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టాన్ని మెయింటేన్ చేయాలని బచావత్ ట్రిబ్యునల్ ఆదేశించింది. సకాలంలో వర్షాలు రాకపోతే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని రాయలసీమ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశాలున్నాయని, తద్వారా ఈ సారి బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటిని మెయింటేన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అధికారులు ఏ మేరకు వ్యవహరిస్తారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.



Next Story