జనసేనతో ఎప్పటికీ పొత్తు ఉంటుంది: పురందేశ్వరి

by srinivas |   ( Updated:2023-12-17 12:23:07.0  )
జనసేనతో ఎప్పటికీ పొత్తు ఉంటుంది: పురందేశ్వరి
X

దిశ, జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఏలూరులో పర్యటించిన ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లను వైసీపీ నమోదు చేయిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై తాము ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. జగన్ నాయకత్వంలోని వైయస్సార్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను తమ నిధులుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఆంధ్రలో రాజకీయపార్టీలు డబ్బు తోడుకుంటున్నాయని పురంధేశ్వరి ధ్వజమెత్తారు.

పోలవరం ద్వారా డబ్బులు తోడు కుంటున్నారు..

‘పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు తోడాలి.. అయితే డబ్బులు తోడు కుంటున్నారు’ అంటూ పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌లు పరిశీలించి త్వరగా ప్రారంభానికి ఆచరణ చేస్తున్నామన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తానన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర సహకారం పూర్తిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిధులు పూర్తిస్థాయిలో ఇస్తోందన్నారు. బీజేపీ బలోపేతానికి అన్ని చోట్ల కార్యకర్తలతో మాట్లాడి ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని విమర్శించారు. అవినీతి మయం విషపూరితంగా రాష్ట్రం తయారయ్యిందన్నారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన పంటపై పోగాకు, వరి పంట నష్టాన్ని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పారు. జనసేనతో తమ పొత్తు ఎప్పటికీ అలానే ఉంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

Advertisement

Next Story