తీర్పు రిజర్వ్: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

by Seetharam |   ( Updated:2023-11-23 13:53:31.0  )
తీర్పు రిజర్వ్: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై ఇరుపక్షాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. దీంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వాదనలు ముగిసినట్లు తెలిపింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది. ఇకపోతే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్ సాల్వేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధానంగా 17ఏ సెక్షన్‌ చుట్టూ వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

సెక్షన్ 17 ఏ వర్తించదు

‘ చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదు. 17ఏ సెక్షన్‌ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్‌ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే’ అని వాదించారు. వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్‌ 422 సీఆర్‌పీసీ కింద క్వాష్ చేయలేం అని ముకుల్ రోహతగ్ీ వాదనలు వినిపించారు. ఈ కేసులో 17ఏ వర్తిస్తుందా?లేదా? అనే దానిపైనే కదా చర్చ జరుగుతుంది అని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ ప్రశ్నించారు. కేసుల నమోదు, ఛార్జిషీట్‌, విచారణ, అన్ని కేసుల్లోనూ జరిగేదే కదా అని వ్యాఖ్యానించారు. దీనిపై ముకుల్ రోహత్గీ సమాధానమిస్తూజజజ అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందని తెలిపారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయని...వీటితోపాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని కోర్టుకు తెలియజేశారు. పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను ఎలా క్వాష్‌ చేస్తారు అని ముకుల్ రోహత్గీ వాదించారు.

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వండి

ఇకపోతే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా 2019 నాటి ‘శాంతి కండక్టర్స్‌’ కేసు, 1964 నాటి రతన్‌లాల్‌ కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని.. వాటిని నిరోధించేందుకు సెక్షన్ 17ఏ ఉందని వాదించారు. సెక్షన్‌ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధింపులు మరింత అధికమవుతాయని తెలిపారు. ఈకేసులో ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో రిమాండ్‌ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు అన్నీ కూడా కేవలం ఆరోపణలతోనే నిండి ఉన్నాయని.. ఎక్కడా నేరం జరిగినట్లు ఆధారాలు లేవని వాదించారు.విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది అని వ్యాఖ్యానించారు.ఈ కేసు విచారణకు సంబంధించి మొదట్లో చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదని గుర్తు చేశారు. రిమాండ్ రిపోర్ట్ సమయంలో చంద్రబాబు పేరు చేర్చడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుంది అని వాదించారు. చంద్రబాబు 40 రోజులుగా జైల్లోనే ఉన్నారని కోర్టు సెలవుల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని హరీశ్ సాల్వే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వాదనలు ముగిసినట్లు తెలిపింది. అంతేకాదు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తీర్పును రిజర్వ్‌ చేసినట్లు ప్రకటించింది. తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది. ఈనెల 20న తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

Read More..

బ్రేకింగ్: చంద్రబాబుకు మరోసారి నిరాశ.. క్వాష్ పిటిషన్ వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Advertisement

Next Story

Most Viewed