Alliance: మొన్న అలా.. నేడు ఇలా... పవన్ యూటర్న్ తీసుకోబోతున్నారా !

by srinivas |   ( Updated:2023-07-09 11:17:46.0  )
Alliance: మొన్న అలా.. నేడు ఇలా... పవన్ యూటర్న్ తీసుకోబోతున్నారా !
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం మొదలు పెట్టేశారా?. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం అంటున్న పవన్ ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారిపోయారా?. రాజకీయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్న పవన్ పోల్ మేనేజ్‌మెంట్ దిశగా అడుగులు వేస్తున్నారా?. నిన్న, మొన్నటి వరకు పొత్తులతోనే ఎన్నికలకు అన్న జనసేనాని యూటర్న్ వెనుక మతలబు ఏంటి? ఇన్నాళ్లు పొత్తులు ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చిన జనసేనాని అకస్మాత్తుగా పొత్తుల గురించి తర్వాత మాట్లాడుదామంటూ దాట వేస్తూ ధోరణి ప్రదర్శించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జనసేన పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ పొత్తులపై యూటర్న్ తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వారాహి విజయయాత్ర సక్సెస్ కావడం..ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పవన్ కల్యాణ్ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఇదే తరుణంలో టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో టీడీపీలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావడం అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలకు సాధ్యం కాని పరిస్థితి. వైసీపీని అధికార పీఠం నుంచి గద్దె దించాలంటే ఖచ్చితంగా కలిసే పోటీకి వెళ్లాల్సి ఉంది. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియనిదేమీ కాదు. కానీ సడన్‌గా పొత్తుల గురించి తర్వాత మాట్లాడుదామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

మొన్న అలా.. నేడు ఇలా

‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీల్చనివ్వను. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం. ఇందుకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి.. బలమున్న పార్టీలతో కలిసే పోటీ చేస్తాం.. నేను సీఎం పదవికి షరతులు పెట్టను.’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా చోట్ల చెప్పారు. ఇదే తరుణంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా భేటీ అయ్యారు. మరోవైపు మిత్రపార్టీ అయిన బీజేపీ అధిష్టానంతోనూ భేటీ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని కలిసే ఎన్నికలకు వెళ్తాయని పరోక్షంగా సంకేతాలిచ్చేశారు. 2014 సీన్ రిపీట్ అవుద్ది అని కూడా పవన్ సంకేతాలిచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ప్రజలు సైతం అనుకుంటున్నారు.

మరోవైపు ఈ మూడు పార్టీలను ఎదుర్కొనేందుకు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉంది.. ఒంటరిగా వెళ్లాలా.. కలసి వెళ్లాలా అనేది తరువాత మాట్లాడుకునే విషయం. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుంది’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లు పొత్తులు ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్.. సడెన్‌గా ఇందుకు చాలా సమయం ఉందంటూ దాటవేత ధోరణి ప్రదర్శించడం రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు. బహుశా టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారా? అన్న సందేహాలు సైతం నెలకొన్నాయి.

యూటర్న్ కాదు

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పొత్తులపై కంటే పార్టీ బలోపేతంపైనే ఫోకస్ పెట్టారని చెప్పుకొస్తున్నారు. ప్రజల్లోకి జనసేనను మరింత బలంగా తీసుకెళ్లడంపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిదినెలలు సమయం ఉన్న నేపథ్యంలో వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి చెక్ పెడతారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పొత్తులపై కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సందర్భగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

‘జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోంది. పార్టీ ప్రజల్లోనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అది మరింత బలంగా ఉంది. యాత్రకు జనం వస్తున్నారు నాయకత్వం దాన్ని అందిపుచ్చుకోవాలి. వారాహి విజయ యాత్ర విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌లో రూల్‌ ఆఫ్‌ లా నాశనం అయిపోయింది. ఏ పార్టీ అయినా రూల్‌ ఆఫ్‌ లాకి కట్టుబడి పని చేయాలి. వైసీపీ దాన్ని పూర్తిగా విస్మరించింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదు. జగన్‌ రెడ్డి, వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయింది’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వంపై జనసేన పోరాటం చేస్తుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు ఇకపై దూకుడుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

టీడీపీలో అయోమయం

తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. వచ్చే ఎన్నికల్లో గెలుపొందకపోతే పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు. మళ్లీ వైసీపీ గెలిస్తే టీడీపీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి జనసేన కంటే టీడీపీకి అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే జనసేనతోపాటు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు బీజేపీ అగ్రనాయకత్వంతోపాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రచారం జరుగుతుంది. ఈ పొత్తులు దాదాపు ఖరారు అయిపోయిందని తెలియడంతో ఇప్పటి వరకు పుట్టలో దాక్కున్న టీడీపీ శ్రేణులు సైతం తెరపైకి వచ్చేశారు. అంతేకాదు టీడీపీ నేతల్లో సైతం ఉత్సాహం నెలకొంది. పొత్తు ఖచ్చితంగా ఉంటుందనే ప్రచారం జరగడం.. ఇప్పటి వరకు చంద్రబాబు 80 నియోజకవర్గాల అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ పొత్తులపై స్పందించేందుకు చాలా టైం ఉందని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story