AP Politics:కార్మికలోకం పొట్ట కొట్టిన జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన: జీవీ ఆంజనేయులు

by Jakkula Mamatha |
AP Politics:కార్మికలోకం పొట్ట కొట్టిన జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన: జీవీ ఆంజనేయులు
X

దిశ,వినుకొండ: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలన కార్మికలోకం పొట్టకొట్టిందని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, కూటమి వినుకొండ అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఒకట్రెండు హామీలపై కంటితుడుపు చర్యలు తప్ప గడిచిన అయిదేళ్లలో ఎప్పుడూ కార్మిక నాయకులను పిలిచి వారి కష్టనష్టాలు విన్న పాపాన కూడా పోలేదని దుయ్యబట్టారు. బుధవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద మే డే వేడుకల్లో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్మికుల సేవలు కొనియాడారు.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ జగన్‌ ఐదేళ్లలో ఒక్కసారే వేతనాలు పెంచారన్నారు. కొన్ని శాఖలో ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి కూడా జీతాలు వేయలేని దుస్థితి ఉందన్నారు. ఒప్పంద పొరుగుసేవల సిబ్బందిని పథకాలకు అనర్హులను చేసి అన్యాయం చేశారన్నారు. జీవీ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమ ప్రభుత్వం రాగానే వారికి పథకాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. కార్మికులకు ఇస్తున్న రూ.15 వేలు కుటుంబ ఖర్చులకే సరిపోవని ఇక పిల్లలనెలా చదివిస్తారని వాపోయారు. అందుకే జీతాలు పెంచే బాధ్యత కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద బీమా కింద కార్మికులకు రూ.10 లక్షలు ఇవ్వాలని వారి తరఫున చంద్రబాబును కోరతానని మాట ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తో పాటు తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తామన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛను వచ్చేలా చూస్తామన్నారు జీవీ. కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన తీరు మరవ లేనిదని అన్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో రోగులు, వారి తరఫున వచ్చే కుటుంబ సభ్యులు శివశక్తి ఫౌండేషన్ తరఫున భోజనాలు పెడుతుంటే వాటిని పంచకుండా తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పెట్టించిన దుర్మార్గుడు బొల్లా అన్నారు జీవీ. ఉచిత మందుల పంపిణీ కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 13 తో వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని, తర్వాత అందరికీ అంతా మంచే జరుగుతుందని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇల్లు లేని మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తనతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు కు ఓటేసి గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story