ఎక్కడ దాక్కున్నా తవ్వి తరలించేస్తాం... వ్యాపారులకు వరంగా వానపాములు

by srinivas |
ఎక్కడ దాక్కున్నా తవ్వి తరలించేస్తాం... వ్యాపారులకు వరంగా వానపాములు
X

దిశ, సూళ్లూరుపేట: మనిషి స్వలాభాలకు ప్రకృతిలోని పలు రకాల సంపదను అమ్మి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. భూగర్భ సంపదను పరిరక్షించాల్సిన అధికారులు ఆ విధులు మావి కావనట్లుగా వ్యవహరిస్తుండడంతో నేడు భూపొలాల్లో దాగి జీవిస్తూ, ప్రకృతిలో మేము ఒక రకమైన మేలు చేసే జీవరాశుల జాబితాలో ఉన్న వాన పాములను సైతం వదలడం లేదు. వ్యాపారులు ఎక్కడ దాగిఉన్నా తవ్వి అమ్మేస్తాం అన్న రీతిలో వానపాముల వ్యాపారం సాగుతోంది.పాపం వాన పాములు ఎవ్వరికి కీడు చేయవు, కాటు వేయవు భూసారవంతానికి ఎంతో దోహదపడతాయి.

అలాంటి వాటిని నేడు కొందరు వ్యాపార ముడి సరుకుగా అక్రమంగా తరలిస్తూ అధిక సంపాదనకు అడుగులు వేస్తున్నారు. సాధారణ వాన పాములు మన నివాస పరిసరాల్లో వర్షాకాలం నేలపై పాకుతూ దర్శనమిస్తాయి కానీ పెద్ద ఆకారం పొడవు కలిగిన వాన పాములు ప్రత్యేకించి పులికాట్ నివాస ప్రాంతంగా భూమిలో జీవిస్తున్నాయి. సూళ్లూరుపేట పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులికాట్ తీర ప్రాంత గ్రామాలైన వేనాడు, ఇరకం, వాటంబేడు, గోపాల రెడ్డిపాలెం తదితర తీర ప్రాంత గ్రామాల్లో వీటినే ఉపాధిగా ఎంచుకొని భూ పొరల నుండి చాటుమాటుగా తవ్వకాలు చేపట్టి ప్రధాన వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటి ధర కిలో 400-500 మధ్య ఉండడంతో ఒక్కో వ్యక్తి నాలుగు నుండి ఐదు కిలోలు ప్రధాన వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వీటిని ప్రధాన వ్యాపారులు ఎక్కడో మారుమూల కొనుగోలు చేస్తూ వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా నెల్లూరు, కావలి, కృష్ణపట్నం వంటి ప్రాంతాల హేచరీలకు అవసరమైన సరుకును అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న సంగతి కొత్త విషయం ఏమీ కాదు. పులికాట్, అందులో ఉన్న ఏ సంపాదనైనా న రక్షణ కల్పించాల్సిన వైల్డ్ లైఫ్, అటవీ శాఖ అధికారులు ఎందుకు వానపాముల అక్రమ రవాణా కట్టడి చేయలేకపోతున్నారన్నది అందరి ప్రశ్నగా ఉంది. ప్రధాన జాతీయ రహదారిపైనే వాహనాల్లో తరలిస్తూ వారి వ్యాపారాన్ని కన్నుగప్పి సాగిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. ఇలాగే వానపాముల వ్యాపారం కొనసాగితే పులికాట్ తీర ప్రాంతాన భూమిలో నివాసం చేసే ఆ రకమైన వాన పాముల జాతి కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. అధికారులు ఇకనైనా వారి బాధ్యతలను గుర్తు చేసుకొని వానపాముల అక్రమ వ్యాపారాలను అరికట్టాల్సి ఉందని ప్రకృతి ప్రియులు అభిప్రాయాలుగా ఉన్నాయి.

Next Story

Most Viewed