న్యాయానికి చోటే లేదా..? వంశీ అరెస్టుపై స్పందించిన జగన్

by Anil Sikha |
న్యాయానికి చోటే లేదా..? వంశీ అరెస్టుపై స్పందించిన జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేశారు.

'సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిగారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్న‌ది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.' అని ఆయన పేర్కొన్నారు.

'మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్‌-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed