బెదిరింపులకు భయపడను : కోటంరెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-04 11:21:32.0  )
బెదిరింపులకు భయపడను : కోటంరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇష్టంలేక మౌనంగా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించానని కానీ నా వ్యక్తిత్వాన్ని శంకించేలా మంత్రులు, నేతలు మాట్లాడుతుండటం బాధాకరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తనపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు శనివారం ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. కాకాణి గోవర్థన్ రెడ్డి తన బావ అని ఆయన ఏలికపాములాంటోడంటూ ధ్వజమెత్తారు. గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డికి వీరవిధేయుడిగా పనిచేశానని ఇప్పుడు కాదు అని చెప్పుకొచ్చారు.

తనపై నమ్మకద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్ చేసిన మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఎందుకు విభేదించావో చెప్పాలని నిలదీశారు. అసలు వైఎస్ఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాకాణికి లేదన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో కాకాణి చేసిన విమర్శలను గుర్తు చేశారు. కాంగ్రెస్ మహా సముద్రం..జగన్ ఒక నీటి బొట్టు అన్నది వాస్తవం కాదా అని గుర్తు చేశారు.

జగన్‌తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని చెప్పావు.. పొదలకూరులో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు కాళ్లకు దండంపెట్టింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. కోర్టులో ఫైళ్ల మాయం కేసులో సీబీఐ ఎంక్వయిరీ జరుగుతుందని ఆ దొంగతనం కేసును ముదు తేల్చుకో అని హితవు పలికారు. ఆ కేసులో అన్ని వేళ్లు నీ వైపు చూపిస్తున్నాయి అది గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు. నేను అధికారం కోసం చూసే వాడినైతే టీడీపీ ప్రభుత్వంలోనే వెళ్లేవాడిని. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో నాకు తెలుసు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

బెదిరింపు కాల్స్‌కు భయపడను

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి రాజకీయ స్థాయికి ఆంధ్ర రాష్ట్రం చాలదని చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి.. వాటికి సలహదారుడిగా ఉంటే బాగుంటుంది అని ఎద్దేవా చేశారు. సజ్జల అన్ని రాజకీయాలు ఆపేసి ఆపరేషన్ రూరల్‌పై ఫోకస్ పెట్టారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. ఇందులో 10 శాతం కాల్స్ బెదిరింపు కాల్సేనని చెప్పుకొచ్చారు.

బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి నన్ను బెదిరించాడు అని ఆరోపించారు. ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొట్టేసి తీసుకెళతానన్నావు.. తీసుకెళ్లు చూద్దాం..నీ మాటలకు బెదరం అని హెచ్చరించారు. ఈ ఫోన్లు అన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డియే చేయిస్తున్నారని ఆరోపించారు. సజ్జల ఇలాంటి వ్యక్తులను ఎంతమందిని పంపించినా బెదిరేది లేదు.. భయపడేది లేదు అని చెప్పుకొచ్చారు. మరొకసారి ఇలా చేస్తే.. నీకు నెల్లూరు రూరల్ నుంచి వీడియో కాల్స్ వస్తాయి అని హెచ్చరించారు.

ఎన్నికేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత తనపై అక్రమ కేసులు పెడతారని తాను ముందే ఊహించానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తనపై కార్పొరేటర్ కిడ్నాప్ కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కిడ్నాప్ కేసు కాదు.. హత్యాయత్నం కేసు కూడా పెట్టుకో..ఎన్ని కేసులు పెట్టినా భయపడను అని హెచ్చరించారు. మీరు నా జోలికి రాకపోతే నేను మీ జోలికి రాను. లేకపోతే రోజు ఇదే పంచాయతీ ఉంటుంది అని హెచ్చరించారు. చాలా మంది కార్పొరేటర్లు వెళుతున్నారు. నేనేమీ బాధపడను...వాళ్ల అవసరాలు వాళ్లకు ఉంటాయి. ఎన్నికలకు ముందు వస్తామని చెబుతున్నారు.

నేతలు..ఉండకపోయినా కార్యకర్తల్లో 90 శాతం నాతోనే ఉంటారు అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్పొరేటర్ విజయ భాస్కర్‌ రెడ్డిని నేను బెదిరించలేదు. నేనే నా కార్యాలయంలో జగన్ ఫ్లెక్సీ‌లు తీయలేదు. నేను మాట్లాడేందుకు వెళ్ళా...దాంతోనే నాపై కిడ్నాప్ కేసు పెట్టారు అని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చె్న్నాయుడు, అయ్యన్న పాత్రుడు, చింతకాయల విజయ్, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ట్యాపింగ్‌పై న్యాయవాదులతో చర్చిస్తున్నా..

ట్యాపింగ్‌ అంశంపై న్యాయవాదులతో మాట్లాడుతున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు అందరికీ తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. నేను నా మిత్రుడితో మాట్లాడిన మాటలన్నింటిని బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. టీడీపీలో అవకాశం వస్తుందో రాదో చూద్దాం. టికెట్లను చంద్రబాబు నిర్ణయిస్తారు. త్వరలో నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తామని ఎవరు అడ్డొస్తారో చూస్తాం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు.

READ MORE

కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు

Advertisement

Next Story

Most Viewed