టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు కేటాయించడంపై హైకోర్టు కీలక ఆదేశాలు

by Seetharam |
టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు కేటాయించడంపై హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి కార్పొరేషన్‌కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అంతేకాదు నిధుల విడుదల నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.తిరుపతి పరిశుభ్రత, తిరుపతి రోడ్ల నిర్వహణ కోసం కార్పొరేషన్ నాలుగు టెండర్లు పిలిచింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిల్ దాఖలు చేయగా ఈపిల్‌పై బుధవారం విచారణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధుల విడుదల అనేది దేవాదాయ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. టీటీడీ నిధులు భక్తుల సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి కోసమే వినియోగించాలని కోర్టుకు తెలియజేశారు. టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్‌ 111కు విరుద్ధమని.. రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మళ్లించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఎప్పుడూ టీటీడీ నిధులు మళ్లించలేదని కోర్టుకు తెలియజేశారు. పిటిషనర్ తరఫు వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్లు ఫైనలైజ్ చేసినా నిధులు విడుదల చెయ్యొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story