ఎమ్మెల్యేల సిఫారసులతో సీఐల బదిలీలు.. సీఎం ఆగ్రహం

by srinivas |
ఎమ్మెల్యేల సిఫారసులతో సీఐల బదిలీలు.. సీఎం  ఆగ్రహం
X

గుంటూరు రేంజ్‌లో సీఐల బదిలీల వ్యవహారం టీడీపీలో ప్రజా ప్రతినిధుల మధ్య చిచ్చు రేపుతోంది. గత ప్రభుత్వంలో వైసీపీ కొమ్ముకాసిన ఖాకీలకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగులు దక్కడం చర్చనీయాంశమైంది. ఇది ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. సీఐల పోస్టింగుల వ్యవహారంలో కీలకమైన ఎమ్మెల్యే తీరు పట్ల కూడా సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.

దిశ ప్రతినిధి, గుంటూరు: వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి కొమ్ముకాసిన ఖాకీలకు కొత్త ప్రభుత్వంలో కూడా పెద్దపీట వేయడం టీడీపీ శ్రేణులను కంగుతినేలా చేస్తోంది. పైగా కొందరు సీఐలకు మంచి పోస్టులే దక్కాయి. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇవ్వడంతోనే వారికి కీలక స్థానాలు దక్కాయని సమాచారం. పైగా వైసీపీ పాలనలో బాధలు పడ్డ పోలీసులను పట్టించుకోకపోవడం అగ్నికి ఆజ్యం పోస్తోంది. వైసీపీ పాలనలో గుంటూరు నగరంతో పాటు పలు స్టేషన్లలో పనిచేసిన సీఐకి ఓ ప్రజాప్రతినిధి సిఫారసు చేశారు. దాదాపు నాలుగేళ్లు వీఆర్‌లో ఉన్న సీఐకి తాను కోరుకున్న గతంలో పనిచేసిన స్టేషన్‌లో పోస్టింగ్‌ ఇవ్వాలంటూ మరో ప్రజా ప్రతినిధి సిఫార్సు చేశారు. ఇంకోచోట మూడేళ్లు వీఆర్‌లో ఉన్న సీఐకి పోస్టింగ్‌ కోసం లేఖ ఇచ్చారు.

ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేల సిఫారసులు

పల్నాడు జిల్లాలో నాలుగు రోజుల కిందట సీఐల బదిలీలు జరిగాయి. ఆ జాబితా చూసిన వారంతా అవాక్కయ్యారు. వైసీపీ హయాంలో హవా సాగించిన వారే తిరిగి తమకు కావలసిన చోట పోస్టింగులు వేయించుకున్నారు. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతోనే వీరంతా తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో చర్చ జరుగుతోంది. నరసరావుపేటలో వైసీపీ పాలనలో సీఐల పోస్టింగులను వేయించడంలో కీలక పాత్ర పోషించిన రియల్టర్‌ ఇప్పుడు కూడా సీఐల బదిలీల్లో చక్రం తిప్పినట్టు రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే విధంగా గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సిఫారసుతో ఓ సీఐ నియామకం జరిగింది. ఇలా కొందరు ఖాకీలు ఎవరి దారిలో వారు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరిని సిఫారసు చేస్తున్నామో ఆరా తీయకుండా ఇష్టారాజ్యంగా లేఖలు ఇస్తున్నారు.

బాధిత ఖాకీలు ఎందరో..

మూడు నాలుగేళ్ల పాటు పాటు వీఆర్‌లో ఉండి పోస్టింగులు, జీతాలు లేకుండా గడిపిన సీఐల బాధ వర్ణణాతీతం. వైసీపీ పాలనలో పోస్టింగులు, పదోన్నతులు లేక ఏళ్ల తరబడి లూపు లైనులో ఉండి రిటైరు అయిన పోలీసు అధికారులూ ఉన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్య అని తొలిసారిగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఓ డీఎస్పీ స్థాయి అధికారి సరైన పోస్టింగ్‌ ఇవ్వకుండా, పదోన్నతి కల్పించకుండా చేశారు. సదరు అధికారి గత నెలలో రిటైర్‌ అయ్యారు. ఓ సివిల్‌ డీఎస్పీ ఐదేళ్ల పాటు పీటీసీ, బెటాలియన్‌ వింగ్‌లోనే పనిచేశారు. ఆయనకు అదనపు ఎస్పీగా కూడా పదోన్నతి రాలేదు. వివేకానందరెడ్డిది హత్య అని గుర్తించి నందుకు ఆయన ఐదేళ్లు పరోక్షంగా శిక్ష అనుభవించారు. రిటైరైన ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వ తీరు మనకు తెలిసిందే..!

సీఐల పోస్టింగుల వ్యవహారం సీఎం దృష్టికి..

గత శుక్రవారం వినుకొండకు వచ్చిన జగన్‌, బాబు పాలనను దుమ్మెత్తి పోస్తూ పోలీసు యంత్రాంగాన్ని విమర్శించారు. ఆ సమయంలో పలువురు సీఐల వ్యవహార శైలిపై టీడీపీ శ్రేణుల్లో చర్చ జరిగింది. ఏ ప్రభుత్వంలో అయినా లాబీయింగ్‌ చేసే సీఐలు, వారికి వత్తాసు పలికే నాయకులు ఉంటే ఎవడైనా విమర్శిస్తాడని చర్చించుకున్నారు. ఈ విషయం ఇంటిలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. సీఐల బదిలీల వ్యవహారంపై ఆరా తీశాయి. ఓ సమగ్ర నివేదిక ఇవ్వటంతో గుంటూరు రేంజిలో సీఐల బదిలీల వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేరింది. ఈ వ్యవహారంలో పాత్రధారులైన ఎమ్మెల్యేలు, వారు వ్యవహరించిన తీరు పట్ల సీఎం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. సీఐల బదిలీల్లో జరిగిన తప్పులను సరి చేయాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలిసింది.



Next Story