AP Politics:పిన్నెల్లి అక్రమాలపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం

by Jakkula Mamatha |
AP Politics:పిన్నెల్లి అక్రమాలపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం
X

దిశ ప్రతినిధి, గుంటూరు:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో పిన్నెల్లి బ్రదర్స్, ఆయన అనుచరులు, ఇతరులు జరిపిన భూ దందాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సీసీఎల్ఏను ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడకు కే మణికంఠ కుమార్ అనే న్యాయవాది మాచర్లలో గత వైసీపీ పాలనలో జరిగిన భూదందాలు జరిగాయని, ఈ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించి వైసీపీ పాలనలో భూ వ్యవహారాలపై సమగ్రంగా సిట్ చేత విచారణ జరిపించాలని పేర్కొంది. సిట్ ఏర్పాటు తర్వాత మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల లో గత ప్రభుత్వంలో జరిగిన అన్ని భూ ఆరోపణల పై సమగ్రంగా విచారించాలని మండల కార్యాలయాల అధికారులతోపాటు, వీఆర్వోలను కూడా వదలకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో జరిగిన భూ వ్యవహారాల పై విచారణ జరగనుంది.

5 వేల ఎకరాల భూములు కబ్జా...?

మాచర్ల నియోజకవర్గంలో 5 మండలాలు, ఓ మున్సిపాలిటీ ఉన్నాయి. వై సి పి పాలన హయాంలో మాచర్ల లో పిన్నెల్లి బ్రదర్స్ వారి అనుచరులు చేసిన అక్రమాలకు హద్దు లేకుండా పోయింది. సామాన్యుడు, అండ లేని వారి ఆస్తులకు రక్షణ కరువైంది. నియోజకవర్గంలోని మండలాలలో దాదాపు 5 వేల ఎకరాలను అధికార పార్టీ వారు కబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క మాచర్ల మండలంలోనే 2 వేల ఎకరాలు, దుర్గి మండలంలో 5 వందల ఎకరాలు ప్రభుత్వ ప్రైవేటు భూములు కబ్జా అయ్యాయంటున్నారు. కారంపూడి మండలంలో శ్రీ సిమెంట్స్ 2 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూముల్లో నిషేధిత భూములు అమ్ముకొని పిన్నెల్లి సన్నిహితులు భారీగా గడించారని ఫిర్యాదులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ఓ దేవాలయ భూమి తన పేరున రికార్డులు తారుమారు చేసి లక్షలు సొమ్ము చేసుకున్నారు. మాచర్ల పట్టణంలో కోట్ల విలువైన ఆస్తులు పరాధీనం అయ్యాయి. మాచర్లలో టీడీపీ ప్రముఖులుగా వెలుగొందిన నిమ్మగడ్డ దుర్గా శ్రీనివాస్ ఆస్తుల కొనుగోలులో పిన్నెల్లి అండ తో అక్రమాలు జరిగాయి.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో దందా..

దివంగత వీరమాచనేని సుభాష్ చంద్రబోస్ కు చెందిన కోట్ల విలువైన ఆస్తులను ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సాగర్ లో కూడా ప్రభుత్వ పోరంబోకు భూములు బినామీలకు రాయించి నాయకులు తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. దేవాదాయ భూములు హాం ఫట్ అయ్యాయి. విలువైన భూమి, స్థలం కనిపిస్తే ఆ యాజమానులను ఏదో విధంగా లొంగ పరచుకొని తమ కోరల్లో బిగించుకున్నారు. సర్వేయర్లను, వీఆర్వోలను తమ చెప్పు చేతల్లో పెట్టుకొన్ని ట్యాంపరింగ్ కు పాల్పడి ఎన్నో విలువైన ఆస్తులు కొట్టేశారని మాచర్ల ప్రజలు చెప్పుకొస్తున్నారు. బ్యాంకుల తాకట్టులో ఉన్న విలువైన ఆస్తుల వేలంలో ఎవరు పాల్గొనకుండా చేసి తమ సన్నిహితుల పేరుతో కోట్ల విలువైన ఆస్తులను నామమాత్రపు రేటుకే వశం చేసుకున్న వైనాలు జరిగాయి. పై అక్రమాలపై విచారణ ప్రారంభ ఐతే మరిన్ని అక్రమాలు వెలుగు చూడనున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన వ్యవహారాలపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కోరికపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.



Next Story